టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ అంటేనే సమఉజ్జీల మధ్య పోరని తొలి వన్డేకు ముందు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అసలైన క్రికెట్ పసందు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లభిస్తుందని వారు ఆరాటపడ్డారు. అయితే ఇరుజట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఏకపక్షంగా సాగింది. కోహ్లి సేన కనీసం పోరాడకుండానే ఆస్ట్రేలియాకు దాసోహమైంది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తర్వాత బౌలింగ్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. దీంతో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. తొలి మ్యాచ్‌లో కోహ్లి సేన ఆట తీరుపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. ఆడింది టీమిండియానేనా అని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయాబ్ అక్తర్ కూడా భారత క్రికెట్ జట్టు ఆటతీరుపై పెదవివిరిచాడు. అంతేకాకుండా టీమిండియాలోని అనేక లోపాలను ఎత్తిచూపుతూ తన యూట్యూబ్ చానళ్లో ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు.
‘ఇద్దరు సమఉజ్జీల పోరు. ఎవరు గెలిస్తే వారిదే ప్రపంచ క్రికెట్‌లో పైచేయి. అలాంటి మ్యాచ్‌లో టీమిండియా అవమానకరంగా ఓడిపోయింది. కనీసం పోరాడకుండానే చేతెలెత్తేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో ధావన్ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. విరాట్ కోహ్లి మరీ 28వ ఓవర్‌లో రావడమనేది నాకు అర్థం కాలేదు. ఇక కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, షమీలు ఇద్దరూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆసీస్ బౌలింగ్‌లో టీమిండియా తడబడితే అదే భారత బౌలింగ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ రికార్డు స్థాయిలో పరుగులు రాబట్టారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇలాంటి మ్యాచ్‌ల్లో టాస్ ఎంతో కీలకం అయితే రెండో మ్యాచ్‌లో కూడా టాస్ ఓడితే భారత్ ఇలానే ఆడుతుందా? టీమిండియాకు ఈ సిరీస్‌ను 2-1తో గెలిచే అవకాశం ఉంది. ఒక వేళ 3-0తో ఓడిపోతే భారత్‌కు అది ఎంతో అవమానకరం. రెండో మ్యాచ్‌లో టీమిండియా ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి. గెలవాలని దూకుడుగా ఆడతుందా? లేక ఒత్తిడిలో చిత్తవుతుందా చూడాలి’అంటూ అక్తర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment