ముంబై : 120 బంతులు.. 16 సిక్సర్లు.. 19 ఫోర్లు.. ముగ్గురు హాఫ్ సెంచరీలు.. 240 పరుగులు. వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన చివరి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ సాధించిన ఘనత. సిరీస్ విజేతను డిసైడ్ చేసే మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శివమెత్తారు. వెస్టిండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో పర్యాటక కరీబియన్ జట్టుకు టీమిండియా 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ(34 బంతుల్లో 71; 6ఫోర్లు, 5 సిక్సర్) తొలి వికెటకు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి శుభారంభం చేశారు. అనంతరం సారథి కోహ్లి (29 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) హిట్టింగ్‌కు నిర్వచనం చెబుతూ విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో విలియమ్స్, కాట్రెల్, పొలార్డ్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. దీంతో ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, కేఎల్ రాహుల్‌లు వీరవిహారం చేస్తున్నారు. ఓవర్‌కు రెండు మూడు బౌండరీల చొప్పున బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి జోరుకు పవర్‌ప్లే ముగిసే సరికే టీమిండియా 72 పరుగులు సాధించడం విశేషం. ఈ క్రమంలో రోహిత్ కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 25 బంతుల్లో6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో అర్దసెంచరీ పూర్తి చేశాడు.
అయితే హాఫ్ సెంచరీతో దూకుడుమీదున్న టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (34 బంతుల్లో 71; 6ఫోర్లు, 5 సిక్సర్) విలియమ్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్ ఘోరంగా నిరాశపరిచాడు. ధాటిగా ఆడాలనే ఉద్దేశంతో పొలార్డ్ ఊరిస్తూ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ షాట్‌లో పంత్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక శాంసన్ రూపంలో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో పంత్ ఇలా నిర్లక్ష్యంగా ఔటవ్వడంపై అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఇదే అదునుగా పంత్ హేటర్స్ అతడిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment