
కోల్‌కతా : ముందుగా అనుకున్నట్లుగానే భారత్, శ్రీలంక మధ్య జరగనున్న తొలి టెస్ట్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే టెస్ట్ మ్యాచ్ టాస్ వేయలేదు. మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. మరోవైపు మ్యాచ్‌కు ముందు రోజు భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా సాగకుండా బంతికి, బ్యాట్‌కు ఆసక్తికర సమరం జరగవచ్చు. వాతావరణ శాఖ ప్రకారం మూడు రోజుల పాటు వరుసగా వర్షసూచన ఉంది.
విరాట్ కోహ్లి నాయకత్వంలో గత రెండేళ్లలో సొంతగడ్డపై ప్రతీ జట్టును చిత్తుగా ఓడిం చిన బృందానికి లంకపై సత్తా చాటడం కష్టం కాబోదు. కాగా, ఇటీవల టెస్టుల్లో పాకిస్తాన్‌పై సాధించిన విజయం లంక జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గతంలో భారతగడ్డపై విజయం అనే పదానికి దూరంగా ఉన్న లంక.. ఎలాగైనా ఈ సిరీస్‌లోనైనా ఆ అపవాదు తొలగించుకోవాలని భావిస్తోంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, రోహిత్/కుల్దీప్, సాహా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్.
శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, మాథ్యూస్, డిక్‌వెలా, తిరిమన్నె/షనక, దిల్‌రువాన్ పెరీరా, లక్మల్, హెరాత్, గమగే/విశ్వ ఫెర్నాండో.