ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్‌కు భారత్
► డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ జంట విజయం
► ఉజ్బెకిస్తాన్‌పై భారత్‌కు 3–0 ఆధిక్యం
బెంగళూరు: అనుభవజ్ఞుడైన రోహన్ బోపన్న... అరంగేట్రం చేసిన శ్రీరామ్ బాలాజీ జోడీ కుదిరింది. వీరిద్దరూ ఆద్యంతం సమన్వయంతో రాణించి అదరగొట్టారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోటీలో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా వరుసగా నాలుగో ఏడాది ప్రపంచకప్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధిం చింది. ఈ ఏడాది సెప్టెంబరులో వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది.
శనివారం ఏకపక్షంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ ద్వయం 6–2, 6–4, 6–1తో దస్తోవ్–ఫెజీవ్ జంటపై గెలిచింది. తమ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌లో ఏ దశలోనూ భారత జంటకు పోటీ ఎదురుకాలేదు. తన కెరీర్‌లో తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన బాలాజీ సర్వీస్ అద్భుతంగా చేయడంతోపాటు నెట్ వద్ద అప్రమత్తంగా ఉన్నాడు. మరో వైపు అపార అనుభవజ్ఞుడైన బోపన్న శక్తివంతమైన సర్వీస్‌లు చేయడంతోపాటు సింగిల్ హ్యాండెడ్ రిటర్న్ షాట్‌లతో అలరించాడు. మ్యాచ్ మొత్తంలో భారత జంట 16 ఏస్‌లు సంధించడం విశేషం. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి.