మూడో రోజే ముగించారు | India Beat Windies By 10 Wickets To Clean Sweep | Sakshi
Sakshi News home page

మూడో రోజే ముగించారు

Published Mon, Oct 15 2018 5:06 AM | Last Updated on Mon, Oct 15 2018 5:06 AM

India Beat Windies By 10 Wickets To Clean Sweep - Sakshi

ఐదేళ్ల వ్యవధి... అదే రెండు టెస్టుల సిరీస్‌... అదే 2–0 ఫలితం... మళ్లీ మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌... 2013లో రెండు ఇన్నింగ్స్‌ విజయాలైతే... ఈసారి ఒక ఇన్నింగ్స్, మరొకటి 10 వికెట్ల గెలుపు... సొంతగడ్డపై ఆడుతూ వెస్టిండీస్‌పై భారత్‌ అపార ఆధిపత్యానికి మరో నిదర్శనం... తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల స్వల్ప ఆధిక్యమే కోల్పోయినా రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్‌ దళాన్ని ఎదుర్కోలేక విండీస్‌ చతికిల పడింది. ఫలితంగా మరోసారి భారీ విజయాన్ని పళ్లెంలో పెట్టి భారత్‌కు అప్పగించింది. ఉమేశ్‌ ముందుండి నడిపించగా మిగతా ముగ్గురూ తలా ఓ చేయి వేయడంతో ప్రత్యర్థిని కుప్పకూల్చిన టీమిండియా 72 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ అందుకుంది.   

సాక్షి, హైదరాబాద్‌: రెండో టెస్టు తొలి రోజు వెస్టిండీస్‌ ఆట చూస్తే ఈ మ్యాచ్‌ మాత్రం మూడు రోజుల్లో ముగిసిపోదని అనిపించింది. కానీ విండీస్‌ అందరి అంచనాలను తప్పని నిరూపించింది. తమకే సాధ్యమైన రీతిలో కుప్పకూలి వేగంగా ఓటమిని ఆహ్వానించింది. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన రెండో టెస్టులో భారత్‌ 10 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. సునీల్‌ ఆంబ్రిస్‌ (38)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 4 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం 72 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కోల్పోకుండా 16.1 ఓవర్లలో 75 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పృథ్వీ షా (45 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (53 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) అజేయంగా నిలిచారు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 308/4తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (134 బంతుల్లో 92; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (183 బంతుల్లో 80; 7 ఫోర్లు) సెంచరీలు సాధించడంలో విఫలమయ్యారు. హోల్డర్‌కు 5 వికెట్లు దక్కాయి. కెరీర్‌లో తొలిసారి మ్యాచ్‌లో పది వికెట్లు (10/133) పడగొట్టిన ఉమేశ్‌ యాదవ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా... ఒక సెంచరీ, ఓ  అర్ధసెంచరీ సహా 237 పరుగులు చేసిన పృథ్వీ షాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 21న గువాహటిలో జరిగే తొలి మ్యాచ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ మొదలవుతుంది.  

రాణించిన అశ్విన్‌...
మూడో రోజు పూర్తి ఉత్సాహంతో ఆట ప్రారంభించిన భారత్‌ ఇన్నింగ్స్‌ ఆశించిన స్థాయిలో సాగలేదు. పంత్, రహానే సెంచరీలు చేజార్చుకున్నారు. 59 పరుగులకే జట్టు మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. ముందుగా ఒకే ఓవర్లో రహానే, జడేజా (0)లను ఔట్‌ చేసి హోల్డర్‌ దెబ్బ తీశాడు. కొద్ది సేపటికే గాబ్రియెల్‌ వేసిన బంతిని పంత్‌ కట్‌ చేయగా కవర్‌ పాయింట్‌లో హెట్‌మెయిర్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో వరుసగా రెండో టెస్టులో కూడా పంత్‌ 90ల్లోనే వెనుదిరిగాడు. కుల్దీప్‌ (6)ను ఔట్‌ చేసిన హోల్డర్‌ తన ఖాతాలో ఐదో వికెట్‌ వేసుకోగా, ఉమేశ్‌ (2) కూడా నిలవలేదు. అయితే మరో ఎండ్‌లో అశ్విన్‌ (83 బంతుల్లో 35; 4 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. గాయం కారణంగా బౌలింగ్‌కు దూరమైన శార్దుల్‌ (4 నాటౌట్‌) బ్యాటింగ్‌కు వచ్చి అండగా నిలవడంతో అశ్విన్‌ మరికొన్ని పరుగులు జోడించాడు. 19 బంతుల వ్యవధిలో నాలుగు బౌండరీలు బాదిన అనంతరం గాబ్రియెల్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ బౌల్డ్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌కు తెర పడింది.  

టపటపా...
తొలి ఇన్నింగ్స్‌లో ప్రదర్శించిన స్ఫూర్తి, పట్టుదలను వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో కొనసాగించలేకపోవడంతో ఆ జట్టు పతనం వేగంగా సాగింది.  తొలి ఇన్నింగ్స్‌లో చివరి రెండు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ మీద నిలిచిన ఉమేశ్‌ తొలి ఓవర్‌ తొలి బంతికి దానిని పూర్తి చేయలేకపోయినా... తర్వాతి బంతికే బ్రాత్‌వైట్‌ (0)ను వెనక్కి పంపించాడు. అనంతరం అశ్విన్‌ తన రెండో ఓవర్లో పావెల్‌ (0)ను ఔట్‌ చేశాడు. గత 18 ఏళ్లలో భారత గడ్డపై విదేశీ జట్టు ఓపెనర్లు ఇద్దరూ డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. అనంతరం కొద్దిసేపు పోరాడి నిలబడే ప్రయత్నం చేసిన హెట్‌మెయిర్‌ (17), హోప్‌ (28) ఐదు బంతుల వ్యవధిలో వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో ఛేజ్‌ (6)ను ఉమేశ్‌ చక్కటి బంతితో బౌల్డ్‌ చేయడంతో 68 పరుగులకు విండీస్‌ సగం వికెట్లు కోల్పోయింది. డౌరిచ్‌ (0) కూడా తొలి బంతికే వెనుదిరిగాక టీ విరామం వచ్చింది.

ఆ తర్వాత ఆంబ్రిస్, హోల్డర్‌ (19) ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి విండీస్‌ 19 పరుగులకు చివరి 4 వికెట్లు కోల్పోయింది.  అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. పృథ్వీ, రాహుల్‌ చకచకా పరుగులు సాధించారు. ముఖ్యంగా రాహుల్‌ కొంత ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. 12 పరుగుల వద్ద సబ్‌స్టిట్యూట్‌ వికెట్‌కీపర్‌ హామిల్టన్‌ సునాయాస స్టంపింగ్‌ను వృథా చేయకుండా ఉంటే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయేదే. ఆ తర్వాత భారత్‌ మరో అవకాశం ఇవ్వలేదు. నిర్ణీత సమయం ముగిసినా ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో పొడిగించిన అదనపు సమయంలో టీమిండియా విజయాన్ని అందుకుంది. బిషూ బంతిని కవర్స్‌ దిశగా షా ఫోర్‌ కొట్టడంతో గెలుపు పరిపూర్ణమైంది.  

స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 311;
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) హోల్డర్‌ 4; పృథ్వీ షా (సి) హెట్‌మెయిర్‌ (బి) వారికెన్‌ 70; పుజారా (సి) సబ్‌–హామిల్టన్‌ (బి) గాబ్రియెల్‌ 10; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్‌ 45; రహానే (సి) హోప్‌ (బి) హోల్డర్‌ 80; రిషభ్‌ పంత్‌ (సి) హెట్‌మెయిర్‌ (బి) గాబ్రియెల్‌ 92; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్‌ 0; అశ్విన్‌ (బి) గాబ్రియెల్‌ 35; కుల్దీప్‌ యాదవ్‌ (బి) హోల్డర్‌ 6; ఉమేశ్‌ (సి) సబ్‌–హామిల్టన్‌ (బి) వారికెన్‌ 2; శార్దుల్‌ ఠాకూర్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (106.4 ఓవర్లలో ఆలౌట్‌) 367.

వికెట్ల పతనం: 1–61, 2–98, 3–102; 4–162; 5–314; 6–314; 7–322; 8–334; 9–339; 10–367. బౌలింగ్‌: గాబ్రియెల్‌ 20.4–1– 107–3, హోల్డర్‌ 23–5–56–5, వారికెన్‌ 31–7–84–2, ఛేజ్‌ 9–1–22–0; బిషూ 21–4–78–0, బ్రాత్‌వైట్‌ 2–0–6–0.

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 0; పావెల్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 0; హోప్‌ (సి) రహానే (బి) జడేజా 28; హెట్‌మెయిర్‌ (సి) పుజారా (బి) కుల్దీప్‌ 17; ఆంబ్రిస్‌ (ఎల్బీ (బి) జడేజా 38; ఛేజ్‌ (బి) ఉమేశ్‌ 6; డౌరిచ్‌ (బి) ఉమేశ్‌ 0; హోల్డర్‌ (సి) పంత్‌ (బి) జడేజా 19; బిషూ (నాటౌట్‌) 10; వారికన్‌ (బి) అశ్విన్‌ 7; గాబ్రియెల్‌ (బి) ఉమేశ్‌ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (46.1 ఓవర్లలో ఆలౌట్‌) 127.

వికెట్ల పతనం: 1–0; 2–6; 3–45; 4–45; 5–68; 6–70; 7–108; 8–109; 9–126; 10–127. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 12.1–3–45–4; అశ్విన్‌ 10–4–24–2; కుల్దీప్‌ 13–1–45–1; జడేజా 11–5–12–3.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (నాటౌట్‌) 33; రాహుల్‌ (నాటౌట్‌) 33; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (16.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 75. బౌలింగ్‌: హోల్డర్‌ 4–0–17–0; వారికన్‌ 4–0–17–0; బిషూ 4.1–0–19–0; ఛేజ్‌ 4–0–14–0.  

► భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన మూడో భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌. గతంలో జవగళ్‌ శ్రీనాథ్‌ (13/132 కోల్‌కతాలో పాకిస్తాన్‌పై 1999లో), కపిల్‌దేవ్‌ (రెండుసార్లు; 11/146 చెన్నైలో పాక్‌పై 1980లో; 10/135 అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌పై 1983లో) మాత్రమే ఈ ఘనత సాధించారు.  
 
► స్వదేశంలో భారత్‌కిది వరుసగా (2013 నుంచి) పదో సిరీస్‌ విజయం. సొంతగడ్డపై అత్యధిక వరుస సిరీస్‌లు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా (రెండుసార్లు 10 చొప్పున; 1994–95 నుంచి 2000–01 వరకు; 2004 నుంచి 2008–09 వరకు) పేరిట ఉన్న రికార్డును భారత్‌ సమం చేసింది.  
 
► వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన చివరి మూడు టెస్టు సిరీస్‌లలో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. 2011లో అశ్విన్, 2013లో రోహిత్‌ ఈ ఘనత సాధించారు.
 
► అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు పొందిన పదో క్రికెటర్‌గా, భారత్‌ నుంచి నాలుగో క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు పొందాడు.  
 
► రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత (92, 93 శ్రీలంకపై 1997లో) వరుస ఇన్నింగ్స్‌లలో 90ల్లో ఔటైన రెండో భారత క్రికెటర్‌గా రిషభ్‌ పంత్‌ నిలిచాడు.  
 
► భారత్‌పై భారత్‌లో ఒకే టెస్టులో అర్ధ సెంచరీ చేసి, ఐదు వికెట్లు కూడా తీసిన ఐదో విదేశీ పేస్‌ బౌలర్‌ జేసన్‌ హోల్డర్‌. గతంలో బ్రూస్‌ టేలర్‌ (న్యూజిలాండ్‌; కోల్‌కతాలో 1965); జాన్‌ లేవర్‌ (ఇంగ్లండ్‌; ఢిల్లీలో 1976); ఇయాన్‌ బోథమ్‌ (ఇంగ్లండ్‌; ముంబైలో 1980); మాల్కమ్‌ మార్షల్‌ (వెస్టిండీస్‌; కోల్‌కతాలో 1983) ఈ ఘనత సాధించారు.  
 
► రవిశాస్త్రి (న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్‌లో 1981లో), కపిల్‌దేవ్‌ (ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో 1985లో) తర్వాత ఓ టెస్టులో నాలుగు బంతుల తేడాలో మూడు వికెట్లు తీసిన మూడో భారతీయ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌.


హోల్డర్‌, పృథ్వీ షా-జడేజా సంబరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement