సొంతమా...సమమా?
⇔ సిరీస్ విజయమే భారత్ లక్ష్యం ∙
⇔ మరో గెలుపుపై విండీస్ గురి
⇔ నేడు చివరి వన్డే ∙రాత్రి గం. 7.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
వరుసగా మూడు వన్డేల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి వెస్టిండీస్‌తో సిరీస్‌ను ఏకపక్షంగా మార్చేసిన భారత్‌కు గత మ్యాచ్ చిన్నపాటి షాక్‌ను ఇచ్చింది. 190 పరుగుల లక్ష్యం అనగానే అప్పుడే సిరీస్ ముగిసిపోయినట్లు భావించినా... చివరకు ప్రత్యర్థిదే పైచేయి అయింది. మరోసారి టీమిండియా తమ సత్తా మేరకు రాణించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా? మరోసారి పోరాటపటిమ ప్రదర్శించి విండీస్ పోరును సమం చేస్తుందా నేడు తేలిపోనుంది.
కింగ్‌స్టన్ (జమైకా): అటు ఆటగాళ్లలోనూ, ఇటు అభిమానుల్లోనూ పెద్దగా ఆసక్తి రేపని వన్డే సిరీస్ చివరకు ముగింపు దశకు చేరుకుంది. నేడు జరిగే చివరిదైన ఐదో వన్డేలో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సిరీస్‌లో ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. మరోవైపు నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన హోల్డర్ బృందం తమకు కలిసొచ్చిన మైదానంలో మరో గెలుపు సాధించాలని పట్టుదలగా ఉంది.మార్పులు ఉంటాయా: గత మ్యాచ్ పరాజయంతో సిరీస్ విజయం కోసం భారత్ మరింతగా శ్రమించాల్సిన స్థితిలో నిలిచింది.
ధోని నెమ్మదైన ఇన్నింగ్స్ ఓటమికి కారణంగా పైకి కనిపిస్తున్నా... ఇందులో అందరి పాత్ర ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వరుసగా నాలుగు వన్డేల్లోనూ కనీసం 50కు పైగా పరుగులు సాధించిన రహానే తన ఫామ్‌ను కొనసాగిస్తూ నే వేగంగా కూడా ఆడాల్సిన అవసరం ఉంది. గత రెండు వన్డేల్లో విఫలమైన ధావన్‌తో పాటు కెప్టెన్ కోహ్లి నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ధోని గత మ్యాచ్ ప్రదర్శనను మరచి అసలు సత్తా చాటితే భారత్ పని సులువవుతుంది. యువరాజ్ గాయం నుంచి కోలుకుంటే దినేశ్ కార్తీక్ స్థానంలో రావచ్చు. బౌలింగ్‌లో భువనేశ్వర్ తిరిగి రానుండగా, జడేజా స్థానంలో అశ్విన్ ఆడతాడు. నాలుగో వన్డే అనుభవాన్ని బట్టి చూస్తే భారత్ అలసత్వం ప్రదర్శిస్తే మొదటికే మోసం రావచ్చు.
హోల్డర్ ఆశలు: 189 పరుగుల స్కోరును కూడా కాపాడుకోవడంతో వెస్టిండీస్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. తొలి మూడు మ్యాచ్‌లలో టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ చేసిన భారీగా పరుగులు సమర్పించుకున్న ఆ జట్టు, గత మ్యాచ్‌లో బౌలింగ్‌తోనే విజయం సాధించగలిగింది. నాలుగో వన్డేలో తలా ఓ చేయి వేసిన టాపార్డర్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. షై బ్రదర్స్, లూయీస్‌లపై ఆ జట్టు ఆధార పడుతోంది. ఛేజ్, జేసన్ మొహమ్మద్ కూడా కీలకం కానున్నారు.
గత మ్యాచ్‌లో తన స్లో బంతులతో ధోనిని కట్టి పడేసిన పేసర్ కెస్‌రిక్ విలియమ్స్ ఆకట్టుకున్నాడు. అతనికి కెప్టెన్ హోల్డర్ అండగా నిలిస్తే మంచి ఫలితం రాబట్టవచ్చు. స్పిన్నర్లు బిషూ, నర్స్ కూడా ప్రభావం చూపిస్తున్నారు. భారత్‌తో జరిగిన గత ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా విండీస్ ఓడిపోయింది. ఆఖరిసారిగా ఆ జట్టు 2006లో భారత్‌ను 4–1తో ఓడించింది. ఈ నేపథ్యంలో కనీసం సిరీస్ కోల్పోకూడదని భావిస్తున్న హోల్డర్ బృందం ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి.
తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రహానే, ధోని, కార్తీక్/ యువరాజ్, జాదవ్/ పంత్, పాండ్యా, కుల్దీప్, జడేజా/ అశ్విన్, ఉమేశ్, షమీ/ భువనేశ్వర్
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయీస్, కైల్ హోప్, షై హోప్, జేసన్ మొహమ్మద్, ఛేజ్, పావెల్, నర్స్, విలియమ్స్, బిషూ, జోసెఫ్
ఈ మైదానంలో ఆడిన 32 వన్డేల్లో వెస్టిండీస్ 24 గెలిచింది. వరుసగా గత 9 మ్యాచ్‌లలో ఇక్కడ ఆ జట్టు విజయం సాధించింది.
మరో మ్యాచ్‌లో ధోని నాటౌట్‌గా నిలిస్తే మురళీధరన్‌ను దాటి అత్యధిక సార్లు (120) అజేయంగా ఉన్న బ్యాట్స్‌మన్‌గా రికార్డును అందుకుంటాడు.
పిచ్, వాతావరణం
మ్యాచ్ రోజున వర్షం కురిసే అవకాశం ఉంది. ఆటకు అంతరాయం కలగవచ్చు. ఈ సిరీస్‌లో అన్నింటికంటే మెరుగైన బ్యాటింగ్ పిచ్ ఇది.