డర్బన్‌లో ఢమాల్
రెండో టెస్టులో భారత్ ఓటమి
10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
1-0తో సిరీస్ కైవసం
రహానే సెంచరీ మిస్
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చూపిన పోరాట స్ఫూర్తిని రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ చూపలేకపోయారు. సులువుగా డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా జారవిడుచుకున్నారు. కలిస్‌కు విజయంతో వీడ్కోలు పలకాలన్న కసితో సఫారీ బౌలర్లు క్రమశిక్షణ చూపించి విజయం సాధించారు. నాణ్యమైన టెస్టు క్రికెట్ ఆడిన స్మిత్ సేన సిరీస్‌ను కైవసం చేసుకుంది.
డర్బన్: దక్షిణాఫ్రికా క్రికెట్‌కు 18 ఏళ్లుగా వెన్నెముకగా నిలిచిన ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ కెరీర్ చివరి టెస్టును చిరస్మరణీయంగా మల్చుకున్నాడు. ఎంతో మంది దిగ్గజాలను ఊరించిన అరుదైన మైలురాయిని (ఆఖరి టెస్టులో సెంచరీ) అతను అలవోకగా అందుకుంటే... సహచరులు అంతకు రెట్టింపు స్థాయిలో ఘనమైన వీడ్కోలు ఇచ్చారు. బ్యాట్స్‌మెన్ ప్రతిభ.. బౌలర్ల మెరుపులు దక్షిణాఫ్రికాకు సిరీస్‌తో పాటు కలిస్‌కు చివరి మ్యాచ్ విజయాన్ని అందించాయి. డర్బన్‌లో సోమవారం ముగిసిన రెండో టెస్టులో స్మిత్‌సేన 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ధోనిసేన నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 11.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 59 పరుగులు చేసి ఛేదించింది. స్మిత్ (33 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్), పీటర్సన్ (37 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడి జట్టుకు గెలుపును అందించారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. రహానే (157 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. పుజారా (100 బంతుల్లో 32; 4 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. స్టెయిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
స్టెయిన్ ఝలక్ : ఓవర్‌నైట్ స్కోరు 68/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌కు ఆరంభంలోనే స్టెయిన్ ఝలక్ ఇచ్చాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కోహ్లి (27 బంతుల్లో 11; 1 ఫోర్)ని తొలి బంతికే అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ బయట పడ్డ బంతి బ్యాట్స్‌మన్ భుజాలకు తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో అంపైర్ అవుటిచ్చారు. దీంతో ఒకింత నిరాశతో కోహ్లి పెవిలియన్‌కు వెళ్లాడు. మరో 16 బంతుల తర్వాత స్టెయిన్ అద్భుతమైన బంతితో పుజారాను బోల్తా కొట్టించాడు. వీరిద్దరు వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరు వద్దే అవుటయ్యారు. ఇక రోహిత్ (46 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్సర్), రహానే కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. కానీ ఫిలాండర్ ఫుల్ లెంగ్త్‌కు రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత రహానేతో జత కలిసిన ధోని (29 బంతుల్లో 15; 2 ఫోర్లు) ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించి అవుటయ్యాడు. జడేజా (5 బంతుల్లో 8; 1 సిక్సర్) విఫలమయ్యాడు. దీంతో భారత్ 154 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టెయిలెండర్ల సహాయంతో రహానే ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు ప్రయత్నించాడు. స్టెయిన్ బౌలింగ్‌లో ఓవర్‌కో బౌండరీ కొడుతూ 84 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జహీర్ (3), ఇషాంత్ (1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో రహానే ఎక్కువగా స్ట్రయిక్ తీసుకున్నాడు. ఫిలాండర్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్‌తో సెంచరీకి చేరువైనా... తర్వాతి బంతికే అవుటయ్యాడు. పీటర్సన్ 4, స్టెయిన్, ఫిలాండర్ మూడేసి వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 334 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 500 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) డు ప్లెసిస్ (బి) పీటర్సన్ 19; విజయ్ (సి) స్మిత్ (బి) ఫిలాండర్ 6; పుజారా (బి) స్టెయిన్ 32; కోహ్లి (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 11; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఫిలాండర్ 25; రహానే (బి) ఫిలాండర్ 96; ధోని (సి) అల్విరో (బి) పీటర్సన్ 15; జడేజా (సి) మోర్కెల్ (బి) పీటర్సన్ 8; జహీర్ ఎల్బీడబ్ల్యు (బి) పీటర్సన్ 3; ఇషాంత్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 1; షమీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (86 ఓవర్లలో ఆలౌట్) 223.
వికెట్లపతనం: 1-8; 2-53; 3-68; 4-71; 5-104; 6-146; 7-154; 8-189; 9-206; 10-223
బౌలింగ్: స్టెయిన్ 21-8-47-3; ఫిలాండర్ 16-4-43-3; మోర్కెల్ 16-6-34-0; పీటర్సన్ 24-3-74-4; డుమిని 8-2-20-0; డు ప్లెసిస్ 1-0-1-0
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: స్మిత్ నాటౌట్ 27; ఎ.పీటర్సన్ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (11.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 59.
బౌలింగ్: షమీ 2-1-4-0; ఇషాంత్ 5-1-29-0; జడేజా 4-0-16-0; రోహిత్ 0.4-0-10-0.