
వందేళ్ల రికార్డును చేజార్చుకున్నారు..
భారత క్రికెట్ జట్టు ఒక కార్డును తృటిలో చేజార్చుకుంది.
ముంబై:భారత క్రికెట్ జట్టు ఒక రికార్డును తృటిలో చేజార్చుకుంది. ఇంగ్లండ్ తో నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఎనిమిదో వికెట్ కు 241 పరుగులను సాధించింది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్లు ఎనిమిదో వికెట్ కు ఈ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే మూడు పరుగుల వ్యవధిలో ఈ జోడి ఇంగ్లండ్ పై ఒక రికార్డును కోల్పోయింది.
అది కూడా వందేళ్లకు పైగా ఉన్న సుదీర్ఘ టెస్టు రికార్డు. 1908లో ఇంగ్లండ్ పై ఎనిమిదో వికెట్ కు హార్టిగన్, హిల్(ఆస్ట్రేలియా)లు నమోదు చేసిన ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం 243. ఇదే నేటికి ఇంగ్లండ్ పై ఎనిమిదో వికెట్ కు అత్యుత్తమం. ఆ రికార్డును భారత జట్టు స్వల్ప తేడాలో చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో జయంత్(104;204 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీ చేసి ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. మరొకవైపు అంతకముందు విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ సాధించడంతో 'రికార్డు' భాగస్వామ్యం నమోదైంది.