
టీమిండియా సరికొత్త మైలురాయి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు సరికొత్త మైలురాయిని సొంతం చేసుకుంది. వన్డేల్లో మూడొందల పరుగుల్ని అత్యధికసార్లు సాధించిన జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును వెనక్కునెట్టింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది.
తద్వారా వన్డే ఫార్మాట్ లో మూడొందలు, అంతకుపైగా స్కోర్లను 96వ సారి భారత సాధించింది. దాంతో ఇప్పటివరకూ ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్ సవరించింది. ఆస్ట్రేలియా 95 సార్లు మూడొందలకు పైగా స్కోర్లను సాధించి రెండో స్థానానికి పరిమితం కాగా, దక్షిణాఫ్రికా(77) మూడో స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్(69), శ్రీలంక(63), ఇంగ్లండ్(57), న్యూజిలాండ్(51) ఆపై వరుస స్థానాల్లో ఉన్నాయి.
ఆదివారం జరిగిన డే అండ్ నైట్ వన్డేలో భారత్ 105 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) , కోహ్లీ (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. ఆపై విండీస్ 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి ఓటమి పాలైంది.