ముంబై: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లబోతున్న భారత జట్టుకు అక్కడ కనీసం ఒక్క ప్రాక్టీస్ కూడా లేకపోవడాన్ని మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ తప్పుబట్టాడు. స్వదేశంలో వరుస విజయాలతో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న టీమిండియా.. సఫారీ పిచ్‌లపై ఎటువంటి వార్మప్ గేమ్ లేకుండా నేరుగా బరిలోకి దిగడం అంత మంచి పరిణామం కాదన్నాడు. మన జట్టు చక‍్కటి సమతుల్యంతో ఉన్నప్పటికీ.. ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా లేకుండా సఫారీలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం కావడం మన ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నాడు.
'ప్రస్తుతం టీమిండియా మంచి జోరు మీద ఉంది. అందుకు కారణం జట్టులో ఉన్న సమతుల్యంతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటమే. అటు బౌలింగ్ విభాగం కూడా చాలా బాగుంది. ప్రధానంగా భారత పేసర్లు ఫామ్‌లో ఉన్నారు. ఏ పిచ్‌లపైనైనా వికెట్లు సాధించే సత్తా మన పేసర్లకు ఉంది. కాకపోతే దక్షిణాఫ్రికాలో ఏ జట్టుకైనా కష్టాలు తప్పవనేది గత రికార్డులు చెబుతున‍్నాయి. అందులోనే దక్షిణాఫ్రికా ఒక కఠినమైన ప్రత్యర్థి. టీమిండియా తగిన ప్రణాళికతో ఆడితేనే అక్కడ గెలుపును సొంతం చేసుకుంటుంది. సఫారీ పర్యటనలో భారత్ జట్టు ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా పోరుకు సిద్దం కావడం అంత మంచి పరిణామం కాదు' అని వాడేకర్ అభిప్రాయపడ్డాడు.
శ్రీలంకతో చివరి టీ 20 మ్యాచ్ ఆడిన రెండు రోజులకు భారత్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్దం కానుంది. అక్కడ మూడు టెస్టుల సిరీస్‌తో పాటు ఆరు వన్డేల సిరీస్, మూడు టీ20ల సిరీస్‌లలో టీమిండియా తలపడనుంది. జనవరి 5 తేదీ నుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment