వికెట్ తీసిన ఆనందంలో అఫ్గాన్ ఆటగాళ్లు
సాక్షి, బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న చారిత్రక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు విజయ్, ధావన్‌లు సెంచరీలతో చెలరేగగా, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీతో మెరిశారు. అయితే మిడిల్ ఆర్డర్ విఫలం అవ్వడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 78 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. తొలి రెండు సెషన్లలలో ప్రభావం చూపని ఆఫ్గాన్ బౌలర్లు చివరి సెషన్‌లో వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి... తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (107; 96 బంతుల్లో 19 ఫోర్లు, 3సిక్సర్లు) అహ్మద్‌జాయ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అనూహ్యంగా పుజారాకు బదులు బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కూడా ఎదురుదాడికి దిగడంతో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. మరో ఎండ్‌లో మురళీ విజయ్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో వరుస ఓవర్లలో మురళీ విజయ్ (105; 153 బంతుల్లో 15 ఫోర్లు, 1సిక్సర్), కేఎల్ రాహుల్(54; 64 బంతుల్లో 8 ఫోర్లు) వెనుదిరగటంతో స్కోర్ నెమ్మదించింది.
మూడో సెషన్‌లో... కెప్టెన్ రహానేతో కలిసి పుజారా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా అఫ్గాన్ బౌలర్ల అటాకింగ్‌తో మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇన్నింగ్స్ మొదట్లో ఏ మాత్రం ప్రభావం చూపని రషీద్ ఖాన్ మూడో సెషన్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. వరుసగా వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు పెవిలియన్‌కు చేరారు. పుజారా(35), రహానే(10), దినేశ్ కార్తీక్(4) పూర్తిగా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్ల దాటికి చివరి సెషన్లలో ఐదు వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసింది. ఆట ముగిసే సమయానికి హార్థిక్ పాండ్యా(10), అశ్విన్(7) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ బౌలర్లలో అహ్మద్ జాయ్ రెండు వికెట్లు తీయగా, రషీద్, ముజీబ్, వఫ్దార్ తలో వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment