శిఖర్ ధావన్, మురళీ విజయ్
బెంగళూరు: స్పిన్ అస్త్రాలు, ఐపీఎల్‌లో తమ బౌలర్ల మెరుపులు... అంటూ ఎంతో హుషారుగా బెంగళూరుకు విచ్చేసిన అఫ్గానిస్తాన్‌కు క్రికెట్‌లో అసలు ‘టెస్టు’ ఎదురైంది. ఒక పూటలో 20 ఓవర్ల ఆటతో ఆకట్టుకున్నంత ఈజీ కాదని భారత బ్యాట్స్‌మెన్ శతక్కొట్టుడుతో చెప్పేశారు. మూడు సెషన్లు... మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిని ఒక్కరోజులోనే బోధపడేలా బాదేశారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (96 బంతుల్లో 107; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), మురళీ విజయ్ (153 బంతుల్లో 105; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదంతొక్కారు.
గురువారం తొలిరోజు ఆటలో భారత్ భారీస్కోరు చేసింది. నిర్ణీత ఓవర్ల కోటా (90 ఓవర్లు) పూర్తికాకపోయినా... 78 ఓవర్లలోనే 6 వికెట్లకు 347 పరుగులు చేసింది. రెండు సెషన్లపాటు నీరుగారిన అఫ్గాన్ బౌలర్లు మూడో సెషన్‌తో ఊపిరి పీల్చుకున్నారు. ఐదు వికెట్లు తీసి హమ్మయ్య అనుకున్నారు. యమిన్ అహ్మద్జాయ్‌కి 2 వికెట్లు దక్కాయి. మూడో సెషన్‌కు ముందు వర్షంతో ఆటకు గంటసేపు అంతరాయం ఏర్పడింది. పొద్దుపోయేవరకూ ఆటను కొనసాగించినా పూర్తి ఓవర్లు సాధ్యపడలేదు.
భారీస్కోరు దిశగా...
టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ధావన్, విజయ్ చిన్నస్వామి స్టేడియంలో చెలరేగారు. తొలి టెస్టు ఆడుతున్న అఫ్గాన్ బౌలింగ్ దళంలో ఎవ్వరిని విడిచిపెట్టకుండా బాదేశారు. వన్డేను తలపించినట్లుగా 11వ ఓవర్లోనే జట్టు స్కోరు 50 చేరింది. 20 ఓవర్లోనే వంద దాటింది. విజయ్ నింపాదిగా ఆడుతుంటే ధావన్ దంచేశాడు. భారత్ 27 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 158 పరుగులు చేసి సెషన్‌ను ముగించింది. రెండో సెషన్‌లో ధావన్ నిష్క్రమించడంతో తొలి వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
అయినప్పటికీ భారత జోరు మాత్రం కొనసాగింది. విజయ్ (80 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, 36.3 ఓవర్లలోనే స్కోరు 200 పరుగులు దాటింది. మరోవైపు లోకేశ్ రాహుల్ (54; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. ఇద్దరు కలిసి మరో భారీ భాగస్వామ్యానికి తెరతీశారు. 46 ఓవర్లో 248/1 వర్షం కురవడంతో టి విరామానికి వెళ్లారు. అనంతరం రాహుల్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 4 పరుగుల వ్యవధిలో విజయ్, రాహుల్ నిష్క్రమించడంతో చివరి సెషన్‌లో అఫ్గాన్‌కు పట్టుచిక్కింది. జట్టు స్కోరు 300 దాటాక రషీద్ బౌలింగ్‌లో రహానే, ముజీబ్ బౌలింగ్‌లో పుజారా (35) వెనుదిరిగారు. దినేశ్ కార్తీక్ రనౌట్ కావడంతో మూడో సెషన్‌లో అఫ్గాన్ చేతికి 5 వికెట్లు చిక్కాయి.
అయ్యో పాపం... అఫ్గాన్, రషీద్...
ఆడుతోంది తొలిటెస్టు కాబట్టి అఫ్గానిస్తాన్ ఆరంభంలో అడుగడుగునా కష్టపడింది. ఫీల్గింగ్ మోహరింపు, బౌలర్ల వినియోగం ఏదీ తెలియక విలవిలలాడింది. మరోవైపు రషీద్ ఖాన్‌కు టెస్టు క్రికెట్ విలువెంటో తెలిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. కట్టుదిట్టంగా 4 ఓవర్లు వేసినంత ఈజీగా 40 ఓవర్లు సాధ్యం కాదని ఒక్కరోజులోనే తెలిసొచ్చింది. ముఖ్యంగా ధావన్ అతని బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. తొలిరోజు అందరికంటే ఎక్కువగా 26 ఓవర్లు వేసిన అతను కేవలం రెండే మెయిడిన్లు వేసి ఏకంగా 120 పరుగులిచ్చుకున్నాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యూ (బి) వఫాదార్ 105; ధావన్ (సి) నబి (బి) యమిన్ అహ్మద్‌జై 107; రాహుల్ (బి) యమిన్ అహ్మద్‌జై 54; పుజారా (సి) నబి (బి) ముజీబ్ 35; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్ ఖాన్ 10; కార్తీక్ రనౌట్ 4; హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ 10; అశ్విన్ బ్యాటింగ్ 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (78 ఓవర్లలో 6 వికెట్లకు) 347.
వికెట్ల పతనం: 1–168, 2–280, 3–284, 4–318, 5–328, 6–334. బౌలింగ్: యమిన్ అహ్మద్‌జై 13–6–32–2, వఫాదార్ 15–4–53–1, నబి 8–0–45–0, రషీద్ ఖాన్ 26–2–120–1, ముజీబ్ 14–1–69–1, అస్గర్ స్తానిక్‌జై 2–0–16–0.
శిఖర్ మెరుపులు
చారిత్రక టెస్టులో ధావన్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మ్యాచ్ మొదలైన మొదటి సెషన్‌లోనే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. 2006లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 99 పరుగులు చేశాడు. 14వ ఓవర్లోనే అఫ్గాన్ తమ తురుపుముక్క రషీద్ ఖాన్‌ను రంగంలోకి దించగా... ధావన్ మరింత రెచ్చిపోయా డు. మూడు బౌండరీలు బాది 47 బంతుల్లోనే (10 ఫోర్లు, 1 సిక్సర్) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో 2 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 15 పరుగులు సాధించాడు. 26వ ఓవర్లో బౌండరీతో ధావన్ కేవలం 87 బంతుల్లోనే 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధావన్‌కంటే ముందు ట్రంపర్ (103 నాటౌట్, ఆసీస్), మెకార్ట్‌నీ (112 నాటౌట్, ఆసీస్), బ్రాడ్‌మన్ (105 నాటౌట్), మజీద్ ఖాన్ (108 నాటౌట్, పాకిస్తాన్), వార్నర్ (100 నాటౌట్, ఆసీస్)లు లంచ్‌లోపే ఈ ఫీట్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment