సిడ్నీలో మోగాలి విజయ ఢంకా | India vs Australia 4th Test: Obsessed India look to script history at SCG | Sakshi
Sakshi News home page

సిడ్నీలో మోగాలి విజయ ఢంకా

Published Thu, Jan 3 2019 12:39 AM | Last Updated on Thu, Jan 3 2019 5:17 AM

India vs Australia 4th Test: Obsessed India look to script history at SCG - Sakshi

గెలిస్తే నయా చరిత్ర... ‘డ్రా’ చేసుకున్నా రికార్డులకెక్కే ఘనత... ఓడిపోకుండా ఉండటం ఒక్కటే కావాల్సింది! అనే స్థితిలో టీమిండియా సిడ్నీ టెస్టు బరిలో దిగబోతోంది. ‘ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ విజయం’ అనే చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు మరొక్క అడుగు దూరంలోనే ఉంది భారత్‌. ఏమరుపాటు లేకుండా... పొరపాటు పడకుండా దీనిని సాకారం చేస్తే కోహ్లి సేన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. అశేష అభిమానులందరి ఆకాంక్షలు నెరవేరుస్తూ మన జట్టు నెగ్గాలని ఆశిద్దాం!  

సిడ్నీ: చరిత్ర సృష్టించేందుకు తహతహలాడుతున్న టీమిండియా... దానిని అడ్డుకుని పరువు కాపాడుకునే యత్నాల్లో ఉన్న ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి ఇక్కడి సిడ్నీ క్రికెట్‌ మైదానం (ఎస్‌సీజీ)లో చివరి టెస్టు జరుగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే భారత్‌ 2–1తో ముందంజలో ఉంది. దీనిలోనూ గెలిస్తే తిరుగులేని ఆధిక్యం (3–1)తో ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్‌ను వశం చేసుకుంటుంది. ‘డ్రా’ అయినా గణాంకాల్లో తేడా తప్ప మన ఘనతేంతగ్గదు. అయితే, సొంతగడ్డపై ప్రత్యర్థికి ఇందుకు అవకాశం ఇవ్వకూడదని కంగారూలు భావిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. 

మార్పులు తప్పలే! 

కీలకమైన టెస్టుకు బ్యాటింగ్‌ బలంగా ఉండాలని భారత్‌ భావిస్తోంది. స్వదేశానికి వచ్చేసిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో పేస్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కాకుండా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఆడించనుండటమే దీనికి నిదర్శనం. దీంతో కర్ణాటక సహచరుడు మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుండగా, ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి ఆరో స్థానంలో వస్తాడు. గాయపడిన పేసర్‌ ఇషాంత్‌ శర్మ బదులుగా ఉమేశ్‌ యాదవ్, కుల్దీప్‌ యాదవ్‌ల పేర్లను చేర్చింది. పిచ్‌ పరిస్థితిని బట్టి స్పిన్నర్‌ కుల్దీప్‌ వైపే మొగ్గుచూపొచ్చని తెలుస్తోంది. 13 మందిలో ఉన్నా, ఇంకా ఫిట్‌నెస్‌ సంతరించుకోని ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను బెంచ్‌కే పరిమితం చేయనున్నారు. ఇద్దరు పేసర్లు (బుమ్రా, షమీ), ఇద్దరు స్పిన్నర్లు (జడేజా, కుల్దీప్‌) వ్యూహంతో టీమిండియా బరిలో దిగనున్నట్లు కనిపిస్తోంది.ఎప్పటిలానే బ్యాటింగ్‌లో పుజారా, కోహ్లి, రహానే బాధ్యత మోయాల్సి ఉంటుంది. ఓపెనర్లు రాహుల్, మయాంక్‌తో పాటు విహారి, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మంచి స్కోర్లు చేస్తే జట్టు భారీ స్కోరుకు బాటలు పడతాయి. అయితే, కొంతకాలంగా ప్రత్యర్థులకు కంగారు పుట్టిస్తున్న పేస్‌ త్రయంలో ఇషాంత్‌ దూరం కావడం లోటే. బుమ్రా, షమీ చక్కటి లయలో ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అనూహ్యంగా కుల్దీప్‌ తేలిపోతే మాత్రం దీని ప్రభావం కనిపిస్తుంది. ముగ్గురు పేసర్లు తప్పనిసరి అనుకుంటే ఉమేశ్‌ను ఆడిస్తారు. పెర్త్‌లోనే ఆకట్టుకోలేని అతడు సిడ్నీలో ఏం చేస్తాడో చూడాలి. 


ఆసీసూ... అదే తీరుగా! 
ఆతిథ్య ఆస్ట్రేలియా సైతం మార్పులు తప్పని పరిస్థితుల్లో ఉంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌పై వేటు వేసి... మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హ్యాండ్స్‌కోంబ్‌ను తీసుకోనుంది. పేస్‌ ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్‌‡్ష స్థానంలో స్పిన్నర్‌ లబషేన్‌ను దింపుతోంది. మార్కస్‌ హారిస్‌కు తోడుగా ఉస్మాన్‌ ఖాజా ఓపెనింగ్‌కు వస్తాడు. అయితే, జట్టును బ్యాటింగ్‌ వైఫల్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. షాన్‌ మార్‌‡్ష, ట్రావిస్‌ హెడ్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఖాజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. కెప్టెన్‌ టిమ్‌ పైన్, లోయరార్డర్‌లో స్టార్క్, కమిన్స్‌ కాస్తోకూస్తో పరుగులు చేస్తుండటంతో జట్టు పోరాడగలుగుతోంది. బౌలింగ్‌లో కమిన్స్‌ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. ప్రధాన పేసర్లు మిషెల్‌ స్టార్క్, హాజల్‌వుడ్‌ నుంచి ఇంతవరకు మంచి ప్రదర్శన రాలేదు. పెర్త్‌లో ప్రతాపం చూపిన స్పిన్నర్‌ లయన్‌ మెల్‌బోర్న్‌లో లయ తప్పాడు. అతడిని భారత అరంగేట్ర ఓపెనర్‌ మయాంక్‌ ఆటాడుకున్నాడు. ఏమాత్రం అనుకూలత ఉన్నా చెలరేగే లయన్‌పై సిడ్నీలో ఓ కన్నేసి ఉంచాల్సిందే. లబషేన్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం ఉపయోగపడుతుందని ఆసీస్‌ ఆశిస్తోంది. 

మూడు రకాలుగా స్పందించే పిచ్‌ ఎదురవనుంది. తొలి రోజు పేసర్లకు... తర్వాత బ్యాట్స్‌మెన్‌కు... మూడో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలించ వచ్చని తెలుస్తోంది. సిడ్నీలో ప్రస్తుతం వేడి వాతావరణం ఉంది. టెస్టు నాలుగు, ఐదో రోజు వర్ష సూచనలున్నాయి. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపొచ్చు. 

పిచ్,  వాతావరణం
ఉదయం 5 గంటల నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం
 
తుది జట్లు (అంచనా)
భారత్‌: రాహుల్, మయాంక్, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానే, విహారి, పంత్, జడేజా, కుల్దీప్‌/ఉమేశ్, బుమ్రా, షమీ. 
ఆస్ట్రేలియా: ఖాజా, హారిస్, షాన్‌ మార్ష్, హెడ్, హ్యాండ్స్‌కోంబ్, పైన్‌ (కెప్టెన్‌), లయన్, లబషేన్, స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌. 

►11 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు సిడ్నీ మైదానంలో 11 టెస్టులు జరిగాయి. ఇందులో భారత్‌ ఒక విజయం (1978లో) సాధించగా... ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో ఐదు ‘డ్రా’గా ముగిశాయి.    

ఇది  ‘పింక్‌’ టెస్టు... 
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ టెస్టు మూడో రోజు మైదానం గులాబీ (పింక్‌) మయం కానుంది. ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ భార్య జేన్‌ మెక్‌గ్రాత్‌ స్మారకార్థం 2009 నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. జేన్‌ 2008లో రొమ్ము క్యాన్సర్‌తో కన్నుమూశారు. అంతకుముందే 2005లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో భార్యాభర్తలు... ‘గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేశారు. తర్వాత మూడేళ్లకు జేన్‌ చనిపోయారు. దీంతో ఏటా జనవరిలో సిడ్నీ ఆతిథ్యమిచ్చే టెస్టును ‘పింక్‌ టెస్టు’గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా మ్యాచ్‌ మూడో రోజును ‘జేన్‌ మెక్‌గ్రాత్‌ డే’గా పేర్కొంటారు. ప్రేక్షకులు గులాబీ దుస్తులతో మైదానానికి వస్తారు. పింక్‌ స్టంప్‌లను ఏర్పాటు చేస్తారు. మహిళల స్టాండ్‌ను ‘జేన్‌ మెక్‌గ్రాత్‌ స్టాండ్‌’గా పిలుస్తారు. ఆటగాళ్లు మెక్‌గ్రాత్‌కు గులాబీ రంగు టోపీలను అందజేస్తారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement