నాగ్‌పూర్‌లో అద్భుతం జరిగింది. బంగ్లాదేశ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన సమయంలో టీమిండియా తీవ్ర ఒత్తిడి మధ్య ఉవ్వెత్తున లేచింది. 43 బంతుల్లో 65 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చి ఒక్కసారిగా తన స్థాయిని ప్రదర్శించి పరువు నిలబెట్టుకుంది. 34 పరుగుల వ్యవధిలో మిగిలిన 8 వికెట్లు తీసి సొంతగడ్డపై దర్జాగా సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో రెండు ప్రధాన వికెట్లు తీసి శివమ్ దూబే విజయానికి బాటలు వేస్తే... ఏకంగా 6 వికెట్ల ప్రదర్శనతో దీపక్ చహర్ అదరగొట్టాడు. చహర్ ప్రదర్శన అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమం కాగా, భారత్ తరఫున టి20ల్లో తొలి హ్యాట్రిక్ తీసిన అరుదైన బౌలర్‌గా కూడా అతను నిలిచాడు. తన 3వ ఓవర్ చివరి బంతికి వికెట్ తీసిన చహర్... నాలుగో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్, రాహుల్ అర్ధసెంచరీలతో టీమిండియా స్కోరులో ప్రధాన పాత్ర పోషించారు.
నాగ్‌పూర్: బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ భారత్ ఖాతాలో చేరింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న చివరి మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాక్కొని రోహిత్ సేన 2–1తో సిరీస్‌ను గెలుచుకుంది. ఆదివారం ఇక్కడి జామ్తా మైదానంలో జరిగిన పోరులో భారత్ 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు.
అనంతరం బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. నయీమ్ (48 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా, మిథున్ (27) సహకరించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 61 బంతుల్లో 98 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించినా... భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. పేసర్ దీపక్ చహర్ కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... శివమ్ దూబేకు 3 వికెట్లు దక్కాయి. చహర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘సిరీస్’ అవార్డులు దక్కాయి.
ఓపెనర్లు విఫలం...
రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (2)ను అవుట్ చేసి షఫీయుల్ తన జట్టుకు శుభారంభం అందించాడు. లోపలికి దూసుకొచ్చిన బంతిని రోహిత్ వికెట్లపైకి ఆడుకోగా ఈ ఓవర్‌లో పరుగులేమీ రాలేదు. సిరీస్‌లో ఇదే తొలి మెయిడిన్ ఓవర్ కావడం విశేషం. కొన్ని చక్కటి షాట్లు ఆడినా... మరోసారి శిఖర్ ధావన్ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు.
రాహుల్ జోరు...
మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ బ్యాట్ నుంచి చూడచక్కటి బౌండరీలు జాలువారాయి. షఫీయుల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను, ముస్తఫిజుర్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి ప్రత్యర్థి ప్రధాన బౌలర్ లయ దెబ్బ తీశాడు. 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే మరో రెండు బంతులకే మిడాఫ్‌లో క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు.
శ్రేయస్ సూపర్...
షఫీయుల్ బౌలింగ్‌లో ‘సున్నా’ వద్ద అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను అమీనుల్ వదిలేశాడు. అదే అమీనుల్ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ బాది అయ్యర్ తన బౌండరీల ఖాతా తెరవడం విశేషం. అఫీఫ్ వేసిన తర్వాతి ఓవర్లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 6 బాది 27 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లాంగాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో అయ్యర్ ఇన్నింగ్స్ ముగిసింది. మరోవైపు పంత్ (6) వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. చివర్లో పాండే (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు), దూబే (9 నాటౌట్) కలిసి 19 బంతుల్లో 30 పరుగులు జోడించడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. .
భారీ భాగస్వామ్యం...
ఛేదనలో బంగ్లాదేశ్‌కు సరైన ఆరంభం లభించలేదు. చహర్ వేసిన మూడో ఓవర్లో ఆ జట్టు లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్ (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నయీమ్ దూకుడైన ఆటతో జట్టును ఆదుకున్నాడు. అతనికి మిథున్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఇదే జోడి బంగ్లాను గెలుపు తీరానికి చేరుస్తుందని భావిస్తున్న తరుణంలో చహర్ బౌలింగ్‌లో మిథున్ అవుట్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత బంగ్లా పతనం వేగంగా సాగింది.
‘హ్యాట్రిక్’ వెలుగులు
దీపక్ చహర్ తన తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ వచ్చి కీలకమైన మిథున్ వికెట్ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. ఈ మూడు వికెట్ల తర్వాత తీసిన మరో మూడు వికెట్లు అతని ఖాతాలో ‘హ్యాట్రిక్’ను చేర్చాయి. 18వ ఓవర్ చివరి బంతికి షఫీయుల్ వికెట్‌ను... ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను అవుట్ చేసి చహర్ ‘హ్యాట్రిక్’తో పాటు ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.
►1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ తీసిన తొలి బౌలర్ దీపక్ చహర్. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్. మలింగ (శ్రీలంక) రెండుసార్లు ‘హ్యాట్రిక్’ తీయగా... బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్ (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), హస్నయిన్ (పాకిస్తాన్), ఖవర్ అలీ (ఒమన్), వనువా (పపువా న్యూ గినియా) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు.
►3 అశ్విన్ (52 వికెట్లు), బుమ్రా (51 వికెట్లు) తర్వాత టి20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో భారత బౌలర్ చహల్. చహల్ తక్కువ మ్యాచ్‌ల్లో (34) ఈ ఘనత సాధించాడు.
►అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్ దీపక్ చహర్. ఈ ఫార్మాట్‌లోనే అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ (6/8; జింబాబ్వేపై 2012లో... 6/16; ఆ్రస్టేలియాపై 2011లో), భారత స్పిన్నర్ చహల్ (6/25; ఇంగ్లండ్‌పై 2017లో) మాత్రమే ఆరు చొప్పున వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) షఫీయుల్ 2; ధావన్ (సి) మహ్ముదుల్లా (బి) షఫీయుల్ 19; రాహుల్ (సి) దాస్ (బి) అల్ అమీన్ 52; అయ్యర్ (సి) దాస్ (బి) సర్కార్ 62; పంత్ (బి) సర్కార్ 6, పాండే (నాటౌట్) 22; దూబే (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 174.
వికెట్ల పతనం: 1–3; 2–35; 3–94; 4–139; 5–144. బౌలింగ్: అల్ అమీన్ 4–0–22–1; షఫీయుల్ 4–1–32–2; ముస్తఫిజుర్ 4–0–42–0; అమీనుల్ 3–0–29–0; సౌమ్య సర్కార్ 4–0–29–2; అఫీఫ్ 1–0–20–0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) సుందర్ (బి) చహర్ 9; నయీమ్ (బి) దూబే 81; సౌమ్య సర్కార్ (సి) దూబే (బి) చహర్ 0; మిథున్ (సి) రాహుల్ (బి) చహర్ 27; ముష్ఫికర్ (బి) దూబే 0; మహ్ముదుల్లా (బి) చహల్ 8; అఫీఫ్ (సి అండ్ బి) దూబే 0; అమీనుల్ (బి) చహర్ 9; షఫీయుల్ (సి) రాహుల్ (బి) చహర్ 4; ముస్తఫిజుర్ (సి) అయ్యర్ (బి) చహర్ 1; అల్ అమీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 144.
వికెట్ల పతనం: 1–12; 2–12; 3–110; 4–110; 5–126; 6–126; 7–130; 8–135; 9–144; 10–144. బౌలింగ్: ఖలీల్ 4–0–27–0; వాషింగ్టన్ సుందర్ 4–0–34–0; దీపక్ చహర్ 3.2–0–7–6; చహల్ 4–0–43–1; దూబే 4–0–30–3.
Comments
Please login to add a commentAdd a comment