ఫ్లాట్ పిచ్ అన్నమాటే గాని పరుగుల ప్రవాహమే లేదు. చూద్దామన్నా కళాత్మక ఇన్నింగ్స్‌లు కనిపించలేదు. నింపాదైన బ్యాటింగ్‌తో ఆతిథ్య జట్టు అతి జాగ్రత్తకు పోగా... ఏ దశలోనూ స్కోరు బోర్డులో భారీ కదలిక లేదు... అంతా అచ్చమైన టెస్టులా సాగుతున్న ఆటను భారత బౌలర్లు ఒక్కసారిగా మలుపు తిప్పారు. చివర్లో టపటపా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టిపడేశారు! ఇక మిగిలింది బ్యాట్స్‌మెన్ వంతే! రెండో రోజు వారెంత బాగా ఆడితే టీమిండియాకు టెస్టుపై అంత పట్టు చిక్కుతుంది!
లండన్: చివరి టెస్టులో కోహ్లి సేనకు ఆశావహ ఆరంభం. పెద్దగా మెరుపుల్లేకుండా సాగిన తొలి రోజు ఆటకు సంతృప్తికర ముగింపు. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన ఐదో టెస్టులో టీమిండియా... ఇంగ్లండ్‌ను 198/7కు కట్టడి చేసింది. కానీ, ఇదేమంత సులువుగా దక్కలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు పరుగులు చేయకున్నా వికెట్ ఇవ్వకుండా రెండు సెషన్ల పాటు విసిగించింది. కెరీర్ చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ అలిస్టర్ కుక్ (190 బంతుల్లో 71; 8 ఫోర్లు), ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (170 బంతుల్లో 50; 4 ఫోర్లు) ఓవర్లకు ఓవర్లు మింగేసి అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే, చివరి సెషన్లో విజృంభించిన భారత బౌలర్లు చకచకా ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను 198/7కు పరిమితం చేశారు. ఆట ముగిసే సమయానికి బట్లర్ (11 బ్యాటింగ్), ఆదిల్ రషీద్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇషాంత్ (3/28) అద్భుతంగా బౌలింగ్ చేయగా... బుమ్రా (2/41), జడేజా (2/57)లకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఓపెనర్లు నిలిచారు
సిరీస్‌లో తీవ్రంగా విఫలమై... ఒక్కసారే అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేసిన ఆతిథ్య జట్టు ఓపెనర్లు కుక్, జెన్నింగ్స్ ఈ మ్యాచ్‌లో నిలిచారు. పిచ్ తీరుకు తోడు ప్రారంభ బౌలర్లు బుమ్రా, ఇషాంత్ పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోవడంతో వారి పని సాఫీగా సాగిపోయింది. భావోద్వేగాల నడుమ చివరి టెస్టు బరిలో దిగిన కుక్... గత వైఫల్యాల ఒత్తిడంతా తొలగిపోయి, స్వేచ్ఛగా కనిపించాడు. కోహ్లి... అనూహ్యంగా 14వ ఓవర్‌లో విహారిని బౌలింగ్‌కు దించాడు. మరో ఎండ్‌లో షమీని ప్రయోగించినా ఫలితం లేకపోయింది. తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం దాటాక, లంచ్‌కు నాలుగు ఓవర్ల ముందు జెన్నింగ్స్ (23)ను జడేజా బుట్టలో పడేశాడు. అతడు వేసిన బంతిని ఆడబోయిన జెన్నింగ్స్ లెగ్ స్లిప్‌లో రాహుల్‌కు చిక్కాడు. దీంతో 60 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 68/1తో ఇంగ్లండ్ లంచ్ విరామానికి వెళ్లింది.
అవకాశాలు చేజార్చి ‘టీ’కి...
ఇషాంత్, బుమ్రా లంచ్ అనంతరం అరగంట పాటు బ్యాట్స్‌మెన్‌ను తీవ్ర పరీక్షకు గురిచేశారు. వరుసగా నాలుగు ఓవర్లు మెయిడెన్ వేశారు. వారి పదునైన బౌలింగ్‌తో ఈ క్రమంలో భారత్‌కు వెంటవెంటనే వికెట్లు దక్కాల్సింది. కానీ, కోహ్లి, రహానే స్లిప్‌లో నాలుగు బంతుల వ్యవధిలో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. తొలుత ఇషాంత్ బౌలింగ్‌లో వైస్ కెప్టెన్ బంతిని అందుకోలేకపోవడంతో కుక్‌కు, తర్వాత బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ వదిలేయడంతో మొయిన్ అలీకి లైఫ్‌లు వచ్చాయి. కొద్దిసేపటికే అలీ ఎల్బీకి రివ్యూ కోరినా ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. షమీ, జడేజాలను దించినా... వారు మరో అవకాశంఇవ్వకుండా బ్యాటింగ్ సాగించారు. కుక్ సిరీస్‌లో తొలి అర్ధ శతకం (139 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్ భాగస్వామ్యం సైతం 60 పరుగులు దాటింది. అప్పటికి స్కోరు 123/1.
50 పరుగులు 6 వికెట్లు...
టీ బ్రేక్ తర్వాత కొద్దిసేపటికే కుక్ కథ ముగిసింది. బుమ్రా బౌలింగ్‌లో అతడి బ్యాట్ లోపలి అంచును తాకిన బంతి వికెట్లను పడగొట్టింది. దీంతో 73 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెరీర్‌లో దాదాపు చివరి ఇన్నింగ్స్ ఆడేశానన్న నిర్వేదంతో కుక్ మైదానాన్ని వీడాడు. మూడు బంతుల వ్యవధిలోనే బుమ్రా... ఇంగ్లండ్‌ను మరో గట్టిదెబ్బ కొట్టాడు. ప్రత్యర్థి సారథి రూట్ (0)ను ఖాతా తెరవకుండానే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. భారీ అప్పీల్ తర్వాత అంపైర్ ఔట్ ప్రకటించగా... రూట్ సమీక్ష కోరాడు. రివ్యూలో ఎల్బీ అని స్పష్టంగా తేలడంతో వెనుదిరగక తప్పలేదు. ఇషాంత్ కాసేపటికే బెయిర్‌స్టో (0) ఆట కట్టించాడు. ఇంగ్లండ్ ఒక్కసారిగా 133/1 నుంచి 134/4కు పడిపోయింది. అలీతో కలిసి ఐదో వికెట్‌కు 37 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలిపే ప్రయత్నం చేసిన స్టోక్స్ (11)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ప్రత్యర్థి కష్టాలను రెట్టింపు చేస్తూ ఈ దశలో ఇషాంత్ నిప్పులు చెరిగాడు. రెండు బంతుల తేడాతో అలీ, స్యామ్ కరన్ (0)లను ఔట్ చేశాడు. చివరి సెషన్‌లో ఇంగ్లండ్ 48 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. కొన్ని కఠినమైన బంతులను ఎదుర్కొన్న బట్లర్... రషీద్ తోడుగా రోజును ముగించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆసాంతం 2 రన్‌రేట్‌కు అటుఇటుగానే సాగింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో మూడో అత్యధిక స్కోరు బై ల ద్వారానే (25 పరుగులు) రావడం గమనార్హం.
►ఐదు టెస్టుల సిరీస్‌లో అన్ని టాస్‌లు ఓడిపోయిన మూడో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి. గతంలో లాలా అమర్‌నాథ్ (వెస్టిండీస్‌పై; 1948 –49), కపిల్ దేవ్ (వెస్టిండీస్‌పై; 1982–83) లకు ఇదే అనుభవం ఎదురైంది.
►భారత్‌పై ఎక్కువ టెస్టులు ఆడిన క్రికెటర్‌గా అలిస్టర్ కుక్ (30 టెస్టులు) గుర్తింపు పొందాడు. పాంటింగ్ (ఆస్ట్రేలియా–29), లాయిడ్, వివ్ రిచర్డ్స్, జావేద్ మియాందాద్ (28 చొప్పున) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
కుక్‌కు అభిమాన వందనం
ఈ టెస్టుతో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్ మైదానంలోకి వస్తుండగా... ప్రేక్షకులు సీట్లలోంచి లేచి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. భారత ఆటగాళ్లు వరుసలో నిలబడి అతడిని ఆహ్వానించారు. కుక్... కోహ్లితో కరచాలనం చేశాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment