ఇంగ్లండ్ కు టీమిండియా భారీ లక్ష్యం
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత టాపార్డర్ రాణించింది. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ కు భారత్ 282 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేశారు. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 26.5 ఓవర్లలో 144 పరుగులు జోడించారు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ ఓపెనర్ మంధన సెంచరీ చేజార్చుకుంది.
నైట్ బౌలింగ్ లో హజెల్ క్యాచ్ పట్టడంతో మంధన (72 బంతుల్లో 90: 11 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్ బాట పట్టింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ హాఫ్ సెంచరీ (86: 7 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి స్కోరు బోర్డును నడిపించింది. 222 పరుగుల వద్ద హజెల్ బౌలింగ్ లో రౌత్ రెండో వికెట్ గా నిష్ర్రమించింది. కాగా చివర్లో కెప్టెన్ మిథాలీ రాజ్ (73 బంతుల్లో 71: 8 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 26) వేగంగా ఆడటంతో 50 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి నైట్ బౌలింగ్ లో మిథాలీ ఔటయింది. ఇంగ్లండ్ బౌలర్లలో నైట్ రెండు వికెట్లు తీయగా, హజెల్ కు ఓ వికెట్ దక్కింది.