ఈస్ట్ లండన్: దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు ట్వంటీ20 సిరీస్‌లోనూ తమ సత్తా చాటుతోంది. శుక్రవారం జరిగిన రెండో టీ20లోనూ సఫారీలపై హర్మన్ ప్రీత్ కౌర్ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లో బఫెలో పార్క్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్లు స్మృతీ మంధాన(57), మిథాలీ రాజ్ (76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకగా మారింది. రెండో టీ20 విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ సేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. లూస్ (32 బంతుల్లో 33), డే క్లెర్క్ (28 బంతుల్లో 26) మాత్రమే రాణించడంతో సఫారీ మహిళల జట్టు ఓ మోస్తరు స్కోరు చేసింది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్(15) నిరాశ పరిచింది. చివర్లో ట్రయాన్ (11 బంతుల్లో 15), ఇస్మాయిల్ (9 బంతుల్లో 16) వేగం పెంచడంతో సఫారీ టీమ్ 142 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనం యాదవ్, పాటిల్ చెరో 2 వికెట్లు తీశారు. శిఖా పాండే, వస్త్రాకర్ లకు చెరో వికెట్ దక్కింది.
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మహిళా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. స్మృతీ మంధాన (42 బంతుల్లో 57: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫె సెంచరీ అనంతరం జట్టు స్కోరు 106 వద్ద తొలి వికెట్‌గా నిష్క్రమించింది. ఆపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (61 బంతుల్లో 76: 8 ఫోర్లు) అజేయ భారీ అర్ధశతకం చేసి, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (7 నాటౌట్)తో కలిసి మరో ఐదు బంతులుండగానే జట్టును విజయతీర్చాలకు చేర్చింది.
సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన మిథాలీకి టి20ల్లో ఇది 12వ అర్ధసెంచరీ. తొలి టీ20లోనూ మిథాలీ రాజ్ (54 నాటౌట్) అజేయంగా నిలవడంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment