సఫారీలను కూల్చేశారు | India won by 337 runs in final test | Sakshi
Sakshi News home page

సఫారీలను కూల్చేశారు

Published Mon, Dec 7 2015 3:02 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

సఫారీలను కూల్చేశారు

సఫారీలను కూల్చేశారు

చివరి టెస్టు.. కనీసం గెలవకపోయినా డ్రా చేయాలని సఫారీలు శతవిధాలా ప్రయత్నించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గోడ కట్టినట్లే ఆటను కొనసాగించారు. అటు హషీమ్ ఆమ్లా దగ్గర్నుంచి.. ఇటు ఏబీ డివిలియర్స్ వరకూ ఎంతో శ్రమించారు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ అత్యంత రక్షణాత్మక పద్ధతిని అవలంభించారు. ఆమ్లా 244 బంతుల్లో 25 పరుగులు, డివిలియర్స్ 297 బంతుల్లో 43 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను గట్టెక్కించే యత్నం చేశారు. కాగా, చివరకు ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.


ఢిల్లీ:నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 481 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు 143 పరుగులకే చాపచుట్టేశారు. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు మరో 71 పరుగుల మాత్రమే చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు.  ఈ రోజు ఆటలో టీ విరామం వరకూ మ్యాచ్ ఫలితంపై పెద్దగా అంచనాలు లేకపోయినా తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు తీసి సఫారీలకు మరో షాకిచ్చారు. దాంతో టీమిండియా 337 పరుగులతో ఘన విజయం సాధించడమే కాకుండా సిరీస్ ను 3-0 తేడాతో గెలిచింది. టీమిండియా బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు సాధించగా, ఉమేష్ యాదవ్ కు మూడు, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు తీశారు.

 

లంచ్ తరువాత అసలు కథ..

నాల్గో టెస్టు ఆఖరి రోజు ఆటలో భాగంగా తొలి సెషన్ లో దక్షిణాఫ్రికానే పైచేయి సాధించినట్లు కనబడింది. లంచ్ విరామ సమయానికి సఫారీలు మూడు వికెట్ల నష్టానకి 94 పరుగులు చేసి మెరుగ్గా కనిపించారు. అయితే ఆ తరువాత అసలు కథ ప్రారంభమైంది. లంచ్ సెషన్ అనంతరం దక్షిణాఫ్రికా వరుసగా రెండు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. తొలుత డుప్లెసిస్(10)ను నాల్గో వికెట్ గా పెవిలియన్ కు చేరగా, స్వల్ప వ్యవధిలోనే జేపీ డుమినీ(0)  ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు.


మూడో సెషన్ లో సఫారీలు టపటపా..


టీ బ్రేక్ వరకూ డివిలియర్స్-విలాస్ ల జోడి మాత్రం కుదురుగా బ్యాటింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా మళ్లీ తేరుకున్నట్లు కనిపించింది.  వీరిద్దరూ చాలా వ్యూహాత్మకంగా ఆడి టీమిండియాను ప్రతిఘటించారు. కాగా, టీ విరామం అనంతరం మూడో సెషన్ లో సఫారీలు వరుస వికెట్లను కోల్పోయారు. 31 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లను నష్టపోయారు. ప్రత్యేకంగా ఉమేష్ యాదవ్ రెచ్చిపోయాడు. విలాస్, అబాట్, పీడిట్ వికెట్లను తీసి సఫారీల పతనాన్ని శాసించగా, అశ్విన్ మరో రెండు వికెట్లను తీసి విజయానికి సహకరించాడు. ఈ మ్యాచ్ లో వరుస రెండు సెంచరీలు చేసిన అజింక్యా రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అశ్విన్ కు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement