ఒక సెషన్.. ఒక వికెట్
ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు ఆఖరి రోజు ఆటలో ఒక సెషన్ ముగిసేసరికి టీమిండియాకు ఒక వికెట్ మాత్రమే దక్కింది.72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్ విరామ సమయానికి 107.0 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి 94 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో ఆమ్లా(25; 244 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్ ను నష్టపోయింది. 40.0 కు పైగా ఓవర్లు క్రీజ్ లో నిలుచున్న ఆమ్లాను రవీంద్ర జడేజా చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు.
అనంతరం ఏబీ డివిలియర్స్ కు జతకలిసిన డు ప్లెసిస్ సమన్వయంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ జోడి ఎటువంటి భారీ షాట్లకు పోకుండా టీమిండియా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. డివిలియర్స్(26 బ్యాటింగ్; 203 బంతుల్లో 4 ఫోర్లు), డు ప్లెసిస్(2 బ్యాటింగ్; 61 బంతులు)లు కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నారు.ఒక వైపు ఈ సిరీస్ లో మరో ఓటమి చవి చూడకూడదని దక్షిణాఫ్రికా భావిస్తుండగా .. మరోవైపు గెలుపుతో ఈ సిరీస్ కు ఘనమైన ముగింపు ఇవ్వాలని టీమిండియా యోచిస్తోంది. అంతకుముందు టీమిండియా గెలిచిన రెండు టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు టీమిండియా చుక్కలు చూపించగా.. ప్రత్యేకంగా ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సఫారీలు రక్షణాత్మక ధోరణిలో ఆడుతూ విరాట్ సేనను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 481 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సఫారీలు పూర్తి నియంత్రణతో ఆటను కొనసాగిస్తున్నారు.