సిడ్నీ : భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర అధ్యాయాన్ని లిఖించింది. తన టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచిన టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఈ ఘనతను సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో గావస్కర్ - బోర్డర్ సిరీస్‌ను భారత్ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని, గతంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన సాకారం చేసింది.
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే కురువడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్ చేయగా, ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే ఆసీస్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కాగా, ఆదివారం నాల్గో రోజు ఆటలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారీ శతకం సాధించిన పుజారా(193) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆపై మెల్ బోర్న్ టెస్ట్‌లో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో చతేశ్వర్ పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బౌలింగ్ విభాగంలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహ్మద్ షమీ 16 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment