స్వదేశంలో భారత్ టెస్టు సీజన్ ముగిసింది. సాధారణంగా 10–12 టెస్టులు ఉండే ‘హోం సీజన్’లో ఐదు టెస్టులంటే చాలా తక్కువ. కానీ రెండు నెలల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మ్యాచుల్లోనూ భారత్ సాధించిన ఏకపక్ష విజయాలు సొంతగడ్డపై మన బలమేమిటో మళ్లీ చూపించాయి. ఇందులో నాలుగు ఇన్నింగ్స్ విజయాలు కాగా, మరో మ్యాచ్ 203 పరుగుల తేడాతో గెలవడం కోహ్లి సేన సత్తాకు నిదర్శనం. టీమిండియా దెబ్బకు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు బెంబేలెత్తిపోయాయి. మన ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగిపోవడంతో జట్టుకు ఎదురులేకుండా పోయింది. భారత్ వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ గడ్డపై తమ తర్వాతి టెస్టు ఆడనుండగా... 2021 వరకు స్వదేశంలో టెస్టులు ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలి ఐదు టెస్టుల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కొన్ని అంశాల్లో భారత ప్రదర్శనను విశ్లేషిస్తే...
పేస్ బౌలర్ల హవా...
స్వదేశంలో భారత స్పిన్నర్లకంటే పేసర్లు అద్భుతంగా ఆడి గెలిపించడం అరుదైన విషయం. కానీ అదిప్పుడు రొటీన్‌గా మారిపోయినట్లు అనిపిస్తోంది. హోం సీజన్‌లో ఉమేశ్ యాదవ్ 23, షమీ 22 వికెట్లు, ఇషాంత్ 14 వికెట్లు చొప్పున పడగొట్టారు. స్పిన్నర్లందరూ కలిపి 37 వికెట్లు తీస్తే ముగ్గురు పేసర్లు కలిపి తీసినవి 59 వికెట్లు కావడం విశేషం. అందులోనూ మరో ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకుండానే ఇది సాధ్యమైంది. బుమ్రా కూడా అందుబాటులో ఉండి ఉంటే తాజా ఫామ్ ప్రకారం సొంతగడ్డపై కూడా కోహ్లి నలుగురు పేసర్లతోనే ఆడేవాడేమో! స్పిన్నర్ ఒక్క వికెట్ కూడా తీయకుండానే స్వదేశంలో తొలిసారి టెస్టు గెలుపు అందుకోవడం మన పేస్ బౌలర్ల ప్రదర్శనను చూపిస్తోంది.
జోరు తగ్గిన స్పిన్నర్లు...
సుదీర్ఘ కాలంగా భారత ప్రధాన స్పిన్నర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్‌కు ఈ ఏడాది వెస్టిండీస్‌లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. అయితే స్వదేశానికి వచ్చేసరికి మాత్రం అతను ఐదు టెస్టుల్లోనూ భాగమయ్యాడు. 20 వికెట్లు పడగొట్టిన అశ్విన్ అనుభవం కీలక సమయాల్లో జట్టుకు పనికొచ్చింది. మరో స్పిన్నర్ జడేజా బ్యాటింగ్‌లో అదరగొట్టినా అసలు పని విషయంలో మాత్రం విఫలమయ్యాడు. 36.07 సగటుతో అతను 13 వికెట్లు తీశాడు. జట్టులో అతనికి ఉన్న స్థానంతో పోలిస్తే ఇది పేలవ ప్రదర్శనే. స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్ ఉంటే తప్ప జడేజా రాణించలేడనే విమర్శలకు ఇది మళ్లీ తెర తీసింది. ఇక మూడో స్పిన్నర్‌గా జట్టులో ఉన్న కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు.
సాహా వహ్వా...
వికెట్ కీపర్‌గా 35 ఏళ్ల సాహాను ఎంపిక చేయడమా... లేక 22 ఏళ్ల రిషభ్ పంత్‌ను ప్రోత్సహించడమా అన్న సందేహంలో ఉన్న టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఈ ఐదు మ్యాచుల్లో సరైన సమాధానం లభించింది. టెస్టులకు సాహానే సరైన వాడంటూ నిరూపణ అయింది. గాయం నుంచి తిరిగొచ్చిన తర్వాత సాహా సూపర్‌గా కీపింగ్ చేశాడు. వికెట్ల వెనక అతని చురుకుదనం, పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు సాహా సత్తాను చూపించాయి. ముఖ్యంగా పింక్‌బాల్ టెస్టులో అతని కదలికలు చాలా బాగున్నాయి. మరోవైపు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో వైఫల్యాల ప్రభావం పడటంతో పంత్‌కు ఒక్క టెస్టు ఆడే అవకాశం కూడా రాలేదు.
కివీస్ గడ్డపై సులువు కాదు...
బౌల్ట్, సౌతీ, వాగ్నర్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్... ఈ బౌలింగ్ బలగాన్ని ఎదుర్కోవడం భారత్‌కు పెద్ద సవాల్‌వంటింది. మన పేస్ బౌలింగ్ దళం కూడా చాలా బాగున్నా బ్యాటింగ్ విషయంలో భారత్ శ్రమించాల్సిందే. స్వింగ్‌కు బాగా అనుకూలించే పరిస్థితుల్లో దూసుకొచ్చే బంతులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎంతో పట్టుదల కనబర్చాల్సి ఉంటుంది. స్వదేశంలో పరుగుల వరద పారించిన భారత ఓపెనర్లకు కివీస్ వాతావరణంలో ఇబ్బందులు తప్పవు. గతంలో అత్యుత్తమ భారత జట్లు కూడా న్యూజిలాండ్‌లో తడబడ్డాయి. భారత్‌లాగే స్వదేశంలో బలమైన జట్టయిన న్యూజిలాండ్ 2017 నుంచి సొంతగడ్డపై టెస్టు ఓడిపోలేదు.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటే చాలు కివీస్ బౌలర్లు మ్యాచ్ మలుపు తిప్పేయగలరు. తాజా ఓటమితో ఇంగ్లండ్‌కు కూడా ఇది అర్థమైంది. వచ్చే ఏడాదిలో జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ టూర్‌లో భారత్ 5 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్‌లలో భారత్ టెస్టు మ్యాచుల్లో తలపడుతుంది. వెల్లింగ్టన్‌లో భారత్ 7 టెస్టులు ఆడింది. కేవలం ఒక టెస్టులో గెలిచి (1968లో), నాలుగింటిలో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిశాయి. క్రైస్ట్‌చర్చ్‌లో భారత్ 4 టెస్టులు ఆడింది. రెండింటిలో ఓడిపోయి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది.
సూపర్ ఓపెనింగ్...
గత రెండేళ్ళలో విదేశాల్లోనే ఎక్కువ టెస్టులు ఆడిన భారత్‌కు ఓపెనర్ల వైఫల్యం పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే ఇప్పుడు హోం సీజన్ కొత్త దారులు తెరచింది. ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్య అవకాశం దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ తాజా ప్రదర్శన తర్వాత నంబర్–1 ఓపెనర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. ఐదు టెస్టుల్లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీతో అతను అదరగొట్టాడు.
ఇక రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్టుల్లో మిడిలార్డర్‌లోనే చెప్పుకోదగ్గ రికార్డు లేని అతను తొలిసారి ఓపెనర్‌గా దిగి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఒకే టెస్టులో రెండు సెంచరీలు, మరో టెస్టులో డబుల్ సెంచరీతో తన స్థాయిని ప్రదర్శించాడు. ఈ సీజన్ వరకైతే మన ఓపెనర్ల ప్రదర్శన తిరుగులేని విధంగా సాగింది.
క్యాచింగ్ వైఫల్యం...
వరుస విజయాల్లో భారత్‌ను కొంత ఇబ్బంది పెట్టిన అంశం ఇది. ఐదు టెస్టుల్లో కలిపి భారత ఆటగాళ్లు ఏకంగా 14 క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో సగం అతి సులువైనవి కాగా, మిగిలినవి కొంత కష్టంతోనైనా అందుకోగలిగేవే! పేసర్లు చెలరేగుతున్న సమయంలో స్లిప్ క్యాచ్‌లే కీలకంగా మారుతాయి. దీనిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment