‘టీమిండియా.. పేస్‌ బౌలింగ్‌తో భయపెడితేనే’ | India's Strength Of Bowling Attack Hope On Australia Tour, Mike Atherton | Sakshi
Sakshi News home page

‘టీమిండియా.. పేస్‌ బౌలింగ్‌తో భయపెడితేనే’

Published Fri, Jun 26 2020 6:12 PM | Last Updated on Fri, Jun 26 2020 6:26 PM

India's Strength Of Bowling Attack Hope On Australia Tour, Mike Atherton - Sakshi

లండన్‌: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్న టీమిండియా సిరీస్‌ను గెలవడం అంత ఈజీ కాదని అంటున్నాడు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైక్‌ అథర్టన్‌. ఆస్ట్రేలియా పర్యటనకు సరైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ లేకుండా వెళితే భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నాడు. ఇటీవల కాలంలో రాటుదేలిన టీమిండియా పేస్‌ బౌలింగ్‌.. ఆస్ట్రేలియాలో జూలు విదిల్చక తప్పదన్నాడు. భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఎంత బలంగా ఉన్నా బౌలింగ్‌తో ఆసీస్‌ను భయపెడితేనే సిరీస్‌లో పోరాడే అవకాశం ఉంటుందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనే బలమైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టవద్దన్నాడు. సాధ్యమైనంతవరకూ పేస్‌ బౌలింగ్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. (233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..)

‘గత కొన్నేళ్లుగా భారత పేస్‌ బౌలింగ్‌లో వేగం పెరిగింది. భారత్‌లో చాలా మంది పేస్‌ బౌలర్లు పుట్టుకొస్తున్నారు. బలమైన పేస్‌ బౌలింగ్‌తో టీమిండియా పటిష్టంగా ఉంది. నేను చూసిన భారత జట్టుకు, ఇప్పటి భారత జట్టుకు చాలా తేడా ఉంది. నేను ఆడిన 1993 సమయంలో భారత్‌ స్పిన్‌పైనే ఆధారపడేది. అప్పుడు కూడా ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నా, ఇప్పుడు ఉన్నంత బలం లేదు. భారత్‌కు పేస్‌ బౌలింగ్‌ ఇప్పుడు అదనపు బలం. ఆసీస్‌ను పేస్‌ బౌలింగ్‌తో భయపడితేనే వారిపై పైచేయి సాధించవచ్చు. బ్యాటింగ్‌లో భారత్‌ బలాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్‌ శర్మ ఎర్రబంతితో కూడా బాగా రాణిస్తున్నాడు. అతనికి జతగా ఓపెనర్‌గా దిగే మయాంక్‌ అగర్వాల్‌ యావరేజ్‌ కూడా బాగుంది. విరాట్‌ కోహ్లి,  చతేశ్వర పుజారాలతో టాపార్డర్‌ బలంగా ఉంది. ఓవరాల్‌గా టీమిండియా బ్యాటింగ్‌ పటిష్టంగానే ఉంది. కానీ పేస్‌ బౌలింగ్‌తో ఆసీస్‌ పని పట్టకపోతే బ్యాటింగ్‌ ఎంత బలంగా ఉన్నా అనవసరం’ అని అథర్టన్‌ అభిప్రాయపడ్డాడు.  2018-19 సీజన్‌లో ఆసీస్‌పై సాధించిన టెస్టు సిరీస్‌ విజయాన్ని టీమిండియా రిపీట్‌ చేయాలంటే పేస్‌ బౌలింగ్‌తో చెలరేగిపోవాలన్నాడు. ఆస్ట్రేలియాలో కూకాబుర్రా బంతులు ఉపయోగించడంతో అవి వెంటనే మెరుపును కోల్పోయి బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందన్నాడు.(‘ఆ ఇద్దరే సిరీస్‌ స్వరూపాన్ని మార్చేశారు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement