
ప్రతీకారం తీరేనా?
⇒నేడు తొలి క్వాలిఫయర్‌లో రైజింగ్ పుణేతో ముంబై ఇండియన్స్ ఢీ
⇒గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు
⇒ఓడిన జట్టుకు మరో అవకాశం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన ముంబై ఇండియన్స్ తొలి క్వాలిఫయర్‌లో అసలు సిసలు ప్రత్యర్థిని ఎదుర్కోబోతోంది. ఇప్పటిదాకా ముంబైకి నాలుగు పరాజయాలు మాత్రమే ఎదురుకాగా ఇందులో రెండు సార్లు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ చేతిలోనే చిత్తయ్యింది. ఇప్పుడు మరోసారి కీలక తరుణంలో పుణేతో ఆడాల్సి వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా స్మిత్ సేనపై ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ఫైనల్ బెర్త్ దక్కించుకున్న తొలి జట్టుగా నిలవాలని ముంబై ఆశిస్తోంది.
అటు ముంబైపై తమకున్న సూపర్ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ మరోసారి పైచేయి సాధించాలని పుణే భావిస్తోంది. అయితే ప్రారంభంలోకన్నా రెండో దశలో అనూహ్య ఆటతీరుతో చెలరేగుతున్న పుణే... ఇప్పటికే తాహిర్ సేవలను కోల్పోగా తాజాగా డాషింగ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండానే బరిలోకి దిగబోతోంది. దీంతో అద్భుత ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేయాలంటే ఆ జట్టు తీవ్రంగా చెమటోడ్చాల్సిందే.
గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరే అవకాశం ఉండటంతో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశాలున్నాయి. ఓడిన జట్టు 19న బెంగళూరులో జరిగే రెండో క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో ముంబై అన్ని జట్లను ఓడించినా పుణేపై గెలుపు రుచి చూడలేకపోయింది. ఆ జట్టుపై ఆడిన రెండుసార్లూ ఓటమిని ఎదుర్కొన్న ముంబైపై కాస్త ఒత్తిడి నెలకొంది. ఈసారైనా తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థికి షాక్ ఇవ్వాలనే కసితో ఉంది. తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతాపై రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించి విజయవంతమైన ముంబై ఈ కీలక మ్యాచ్‌లో తుది జట్టు కూర్పుపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. మరోవైపు తమ చివరి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఆడుతూ ప్లే ఆఫ్ వైపు దూసుకెళుతున్న పంజాబ్‌ను దారుణంగా ఓడించిన పుణే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బౌలర్లు మరోసారి రాణిస్తే ఫైనల్‌కు చేరడం కష్టమేమీ కాదనే అభిప్రాయంతో ఉంది.
బ్యాటింగే బలం...
సీజన్‌లో ఇప్పటిదాకా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విజయవంతమైంది. ఓపెనర్లు సిమన్స్, పార్థివ్‌లతో పాటు పొలార్డ్, కెప్టెన్ రోహిత్, నితిశ్ రాణా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక పాండ్యా సోదరులు కృనాల్, హార్దిక్ తమ ఆల్‌రౌండ్ షోతో జట్టుకు వెన్నెముకలా నిలిచారు.
స్టోక్స్ లేకుండానే...
వాస్తవానికి పుణే జట్టు ప్లే ఆఫ్ వరకు చేరుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదు. అయితే మ్యాచ్‌లు జరుగుతున్నకొద్దీ ఈ జట్టు ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆరితేరుతూ ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లోనైతే తమ బౌలర్ల ప్రతిభతో పంజాబ్‌ను కేవలం 73 పరుగులకే కుప్పకూల్చగలిగింది. పేసర్లు జయదేవ్ ఉనాద్కట్ ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టాడు. శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ అతడికి సహకరిస్తున్నారు. ఈ త్రయం మరోసారి ముంబైపై విజృంభించాలని భావిస్తుంది. స్పిన్నర్ జంపా కూడా రాణించడం ఈ జట్టుకు కలిసొచ్చేది. బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, రహానే, ధోని, మనోజ్ తివారి ఫామ్‌లో ఉండడం అనుకూలాంశం.
⇒రాత్రి గం. 8.00 నుంచిసోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం