ధోనీ సేన ఢమాల్: 'టాప్' లేపిన హైదరాబాద్
► ఐపీఎల్‌లో టాప్‌కి సన్‌రైజర్స్
► ఉత్కంఠపోరులో పుణేపై విజయం
► ధోనిసేన ప్లేఆఫ్ అవకాశాలు గల్లంతు
సన్‌రైజర్స్ బౌలర్లు మరోసారి మ్యాజిక్ చేశారు. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడి జట్టును ప్లే ఆఫ్‌కు చేరువ చేశారు. వరుసగా నాలుగో విజయం సాధించిన వార్నర్ బృందం మొత్తం ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. అటు పుణే సూపర్ జెయింట్స్ సీజన్‌లో ఎనిమిదో మ్యాచ్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి.
విశాఖపట్టణం: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై సన్ బౌలర్లు సమష్టిగా రెచ్చిపోయారు. దీంతో మంగళవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వార్నర్ సేన నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో 14 పాయింట్లతో గుజరాత్ లయన్స్‌ను వెనక్కి నెట్టి టాప్‌కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (27 బంతుల్లో 33; 2 ఫోర్లు; 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (37 బంతుల్లో 32; 3 ఫోర్లు), యువరాజ్ సింగ్ (21 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 19 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ బౌలర్ ఆరు వికెట్లు తీయడం ఇది రెండోసారి. 2008 ప్రారంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున సోహైల్ తన్వీర్ ఈ ఫీట్ సాధించాడు. అనంతరం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసి ఓడింది. జార్జ్ బెయిలీ (40 బంతుల్లో 34; 3 ఫోర్లు; 1 సిక్స్), ధోని (20 బంతుల్లో 30; 1 ఫోర్; 2 సిక్సర్లు), అశ్విన్ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) పోరాడారు.
జంపా సంచలన బౌలింగ్
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. తొలి ఓవర్‌లో దిండా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వగా.. రెండో ఓవర్‌లో వార్నర్ (14 బంతుల్లో 11; 1 సిక్స్) కవర్స్ ద్వారా భారీ సిక్స్ కొట్టి మరుసటి ఓవర్‌లోనే అవుటయ్యాడు. ఆర్పీ సింగ్ వేసిన ఆరో ఓవర్‌లో ధావన్ ఫోర్, సిక్స్‌తో 13 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ అతి జాగ్రత్తకు పోవడంతో పరుగులు రావడం గగనమైంది. మధ్య ఓవర్లలో రజత్ భాటియా, ఆర్.అశ్విన్ అద్భుతంగా రాణించి పరుగులు రాకుండా చూశారు. ఇక చివరి ఐదు ఓవర్లలో ఆడమ్ జంపా ఏకంగా ఆరు వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ను విలవిలలాడేలా చేశాడు.
15వ ఓవర్‌లో యువరాజ్ (21 బంతుల్లో 23; 1 ఫోర్; 2 సిక్సర్లు) సిక్స్, ఫోర్‌తో జోరు పెంచే ప్రయత్నం చేసినా మరుసటి ఓవర్‌లో జంపా గూగ్లీకి వెనుదిరగక తప్పలేదు. అటు విలియమ్సన్, హెన్రిక్స్ (8 బంతుల్లో 10; 1 ఫోర్)లను కూడా జంపా తన తర్వాతి ఓవర్‌లో వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. దీపక్ హుడా (5 బంతుల్లో 14; 2 సిక్సర్లు)తో పాటు నమన్ ఓజా (5 బంతుల్లో 7; 1 ఫోర్), భువనేశ్వర్ (1)లను చివరి ఓవర్‌లో అవుట్ చేసిన ఈ ఆసీస్ లెగ్గీ.. వార్నర్ సేనను చావు దెబ్బ తీశాడు.
చివరి వరకు పోరాడినా..
స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణేకు తొలి ఓవర్లోనే భువనేశ్వర్ తన స్వింగ్ పవర్‌తో షాక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న రహానేను చక్కటి అవుట్ స్వింగర్‌తో పెవిలియన్‌కు చేర్చి మెయిడిన్ ఓవర్ వేశాడు. నాలుగో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఖవాజా (8 బంతుల్లో11; 2 ఫోర్లు) రనౌట్‌గా వెనుదిరగడంతో పవర్‌ప్లేలో పుణే రెండు వికెట్లకు 25 పరుగులు చేసింది. దీంతో పిచ్ పరిస్థితిని గమనించిన బెయిలీ, పించ్ హిట్టర్‌గా వచ్చిన అశ్విన్ జాగ్రత్తగా ఆడారు. యువరాజ్ బౌలింగ్‌లో ఓ సిక్స్ బాదిన బెయిలీని హెన్రిక్స్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపట్లోనే వరుస ఓవర్లలో అశ్విన్, సౌరభ్ తివారి (9) వెనుదిరగడంతో జట్టు ఇబ్బందిలో పడింది. 5 ఓవర్లలో 52 పరుగులు కావాల్సిన ఈ దశలో కెప్టెన్ ధోని, పెరీరా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 18వ ఓవర్‌లో పెరీరా సిక్స్, ధోని ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి.
చివరి ఓవర్‌లో 14 పరుగులు రావాల్సి ఉండగా నె హ్రా బౌలింగ్‌లో పెరీరా భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. ఇక 3 బంతుల్లో 12 పరుగులు అవసరం కాగా ధోని సిక్స్ బాదాడు. అయితే ఐదో బంతికి ధోని రనౌట్ కావడంతో పాటు చివరి బంతికి జంపా కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో హైదరాబాద్‌కు ఉత్కంఠ విజయం దక్కింది.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ధోని (బి) ఆర్పీ సింగ్ 11; ధావన్ (సి) తివారి (బి) అశ్విన్ 33; విలియమ్సన్ (సి) భాటియా (బి) జంపా 32; యువరాజ్ సింగ్ (సి) తివారి (బి) జంపా 23; హెన్రిక్స్ (సి) రజత్ భాటియా (బి) జంపా 10; హుడా (స్టంప్డ్) ధోని (బి) జంపా 14; నమన్ ఓజా (బి) జంపా 7; భువనేశ్వర్ (సి) తివారి (బి) జంపా 1; శరణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1-18, 2-64, 3-96, 4-114, 5-114, 6-135, 7-136, 8-137.
బౌలింగ్: దిండా 4-0-26-0; ఆర్పీ సింగ్ 3-0-23-1; అశ్విన్ 4-0-16-1; జంపా 4-0-19-6; భాటియా 3-0-26-0; పెరీరా 2-0-26-0.
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) ఓజా (బి) భువనేశ్వర్ 0; ఖవాజా (రనౌట్)11; బెయిలీ (సి) నెహ్రా (బి) హెన్రిక్స్ 34; అశ్విన్ (సి) ఓజా (బి) శరణ్ 29; సౌరభ్ తివారి (సి) ధావన్ (బి) నెహ్రా 9; ధోని (రనౌట్) 30; పెరీరా (సి) హెన్రిక్స్ (బి) నెహ్రా 17; భాటియా నాటౌట్ 0; జంపా (సి) ఓజా (బి) నెహ్రా 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133.
వికెట్ల పతనం: 1-0, 2-19, 3-68, 4-78, 5-86, 6-126, 7-133, 8-133.
బౌలింగ్: భువనేశ్వర్ 4-1-20-1; నెహ్రా 4-0-29-3; శరణ్ 4-0-26-1; హెన్రిక్స్ 3-0-20-1; యువరాజ్ 1-0-10-0; ముస్తఫిజుర్ 4-0-26-0.