
ఇషాంత్ శర్మ
ఐపీఎల్‌లో అవకాశం లభించని భారత సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ అదే సమయంలో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ససెక్స్ జట్టు తరఫున దాదాపు రెండు నెలల పాటు ఆడేందుకు ఒప్పందం చేసుకున్న ఇషాంత్ కనీసం ఐదు కౌంటీ మ్యాచ్‌లలో బరిలోకి దిగే అవకాశం ఉంది.
81 టెస్టు మ్యాచ్‌ల అపార అంతర్జాతీయ అనుభవం ఉన్న పేస్ బౌలర్ తమ జట్టుతో చేరనుండటంపై ససెక్స్ హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీ సంతోషం వ్యక్తం చేశాడు. వచ్చే ఆగస్టులో భారత జట్టు ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో ఇషాంత్ తొలిసారి కౌంటీల్లో ఆడటం టీమిండియాకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇప్పటికే పుజారా కూడా కొత్త సీజన్‌లో యార్క్‌షైర్ తరఫున ఆడటం ఖాయమైంది.