
ఇంకేం మిగల్లేదు లంకకు... ఓడిపోయేందుకు..! మరో మ్యాచ్ లేదు భారత్‌కు... గెలిచేందుకు..! ఫార్మాట్‌కు మూడు మ్యాచ్‌ల చొప్పున ఆడిన పర్యాటక జట్టు... ఒక టెస్టు (కోల్‌కతా)లో వణికించింది. ఒక వన్డే (ధర్మశాల)లో గెలిచింది. కానీ టి20ల్లో పరిపూర్ణంగా ఓడింది. టీమిండియా చేతిలో వైట్‌వాష్ అయ్యింది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో కలిపి భారత్ ‘ఆరే’స్తే (1+2+3)... శ్రీలంక మాత్రం ఒక్కటంటే ఒక్క గెలుపుతో సరిపెట్టుకుంది.
ముంబై: భారత్... సిరీస్‌ను ముందే గెలుచుకుంది. ఇపుడు చివరి మ్యాచ్‌నూ గెలిచింది. టి20 సిరీస్‌కు క్లీన్‌స్వీప్‌తో ముగింపు పలికింది. మొత్తానికి భారత్‌కు విజయవంతంగా సాగిన 2017 ఏడాది దిగ్విజయంగానే ముగిసింది. ఎందులోనూ కలిసి రాకపోవడంతో శ్రీలంక వైట్‌వాష్‌తో తిరుగుముఖం పట్టింది. ఆఖరి టి20లో బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. బౌలింగ్‌లో ఉనాద్కట్ (2/15), హార్దిక్ పాండ్యా (2/25)... బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (29 బంతుల్లో 32; 4 ఫోర్లు) రాణించారు.
వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. గుణరత్నే (37 బంతుల్లో 36; 3 ఫోర్లు), షనక (24 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు) లంక తరఫున పోరాడారు. ఉనాద్కట్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీయగా... సుందర్, సిరాజ్, కుల్దీప్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి గెలిచింది. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తాజా విజయంతో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.
వికెట్లు ఫటాఫట్...
టాస్ నెగ్గిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు డిక్‌వెలా (1), తరంగ (11) తడబడ్డారు. అరంగేట్రంలోనే మ్యాచ్ తొలి ఓవర్ వేసిన సుందర్ 6 పరుగులిచ్చాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఓవర్‌కు వికెట్ చొప్పున టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రెండో ఓవర్లో డిక్‌వెలాను ఉనాద్కట్, మూడో ఓవర్లో కుశాల్ పెరీరా (4)ను సుందర్ పెవిలియన్ చేర్చారు. తిరిగి నాలుగో ఓవర్లో తరంగను ఉనాద్కట్ అవుట్ చేయడంతో లంక 18 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తర్వాత సమరవిక్రమ (17 బంతుల్లో 21; 3 ఫోర్లు), గుణరత్నే కాసేపు ధాటిగా ఆడుతూనే వికెట్ల పతనానికి కళ్లెం వేశారు. దీంతో ఎనిమిదో ఓవర్లో లంక ఫిఫ్టీ పూర్తయింది.
పాండ్యా వేసిన అదే ఓవర్లో జోరు మీదున్న సమరవిక్రమ మిడాఫ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ తర్వాత స్కోరుబోర్డులో మరో 20 పరుగులు జతయ్యాయో లేదో భారత బౌలర్లు మరో వికెట్‌ను పడేశారు. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గుణతిలక (3) డీప్ మిడ్‌వికెట్ వద్ద పాండ్యా క్యాచ్‌తో పెవిలియన్ బాటపట్టాడు. 72 పరుగుల వద్ద లంక ఐదో వికెట్‌ను కోల్పోయింది. మరో 13 పరుగుల వ్యవధిలో కెప్టెన్ తిసారా పెరీరా (11; 2 ఫోర్లు) ఆటను సిరాజ్ ముగించాడు. పడుతూ లేస్తూ సాగిన లంక స్కోరు 16వ ఓవర్లో 100కు చేరింది. కుదురుగా ఆడిన గుణరత్నేను పాండ్యా అవుట్ చేశాడు. సిరాజ్ చివరి ఓవర్లో షనక (24 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు), ధనంజయ (11 నాటౌట్; 2 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో 18 పరుగులు వచ్చాయి.
రాణించిన శ్రేయస్, పాండే...
భారత్ లక్ష్యం 136. తొలి రెండు టి20ల్లో భారత్ సూపర్ హిట్ స్కోర్లకు ఇదేమాత్రం సరిపోలదు. కానీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (4), రోహిత్ శర్మ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్లు కోల్పోవడంతో భారత్ అనవసర ఒత్తిడి కొనితెచ్చుకోవడం ఎందుకనే ధోరణిలో ఆడింది. దీంతో కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ 20 (19.2)వ ఓవర్ దాకా ఆడాల్సివచ్చింది. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే అడపాదడపా బౌండరీలతో స్కోరును 81 పరుగుల దాకా తీసుకొచ్చారు. ఆ స్కోరు వద్దే పాండే బలంగా కొట్టిన షాట్ వేగంగా వెళ్లి నాన్ స్ట్రయిక్ వికెట్లను కూల్చింది. అంతకంటే ముందే ఆ బంతి బౌలర్ ధనంజయ చేతి వేళ్లను తాకడంతో క్రీజులో లేని శ్రేయస్ అనూహ్యంగా రనౌటయ్యాడు. తర్వాత పాండ్యా (4) ఇలా వచ్చి అలా వెళ్లాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటాక మనీశ్ పాండే కూడా నిష్క్రమించడంతో ధోని (10 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 18 నాటౌట్; 1 సిక్స్) మరో వికెట్ చేజారకుండా మ్యాచ్‌ను ముగించారు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: డిక్‌వెలా (సి) సిరాజ్ (బి) ఉనాద్కట్ 1; తరంగ (సి) పాండ్యా (బి) ఉనాద్కట్ 11; కుశాల్ పెరీరా (సి అండ్ బి) సుందర్ 4; సమరవిక్రమ (సి) దినేశ్ కార్తీక్ (బి) పాం డ్యా 21; గుణరత్నే (సి) కుల్దీప్ (బి) పాండ్యా 36; గుణతిలక (సి) పాండ్యా (బి) కుల్దీప్ 3; తిసారా పెరీరా (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 11; షనక నాటౌట్ 29; ధనంజయ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 135. వికెట్ల
పతనం: 1–8, 2–14, 3–18, 4–56, 5–72, 6–85, 7–111. బౌలింగ్: సుందర్ 4–0–22–1, ఉనాద్కట్ 4–0–15–2, సిరాజ్ 4–0–45–1, హార్దిక్ పాండ్యా 4–0–25–2, కుల్దీప్ 4–0–26–1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) కుశాల్ పెరీరా (బి) షనక 27; రాహుల్ ఎల్బీడబ్ల్యూ (బి) చమీర 4; శ్రేయస్ రనౌట్ 30; మనీశ్ పాండే (బి) చమీర 32; పాండ్యా (సి) డిక్‌వెలా (బి) షనక 4; దినేశ్ కార్తీక్ నాటౌట్ 18; ధోని నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 139.
వికెట్ల పతనం: 1–17, 2–39, 3–81, 4–99, 5–108.
బౌలింగ్: ధనంజయ 4–0–27–0, చమీర 4–0–22–2, పెరీరా 3.2–0–22–0, ప్రదీప్ 4–0–36–0, షనక 4–0–27–2.
అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా...
ముంబైలో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ఆడటం ద్వారా... అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు) రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్సు టాప్–5 క్రికెటర్లలో సుందర్ తర్వాత రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు; ఇంగ్లండ్‌పై ఫిబ్రవరి 1న, 2017)... ఇషాంత్ (19 ఏళ్ల 152 రోజులు; ఆస్ట్రేలియాపై ఫిబ్రవరి 1న, 2008)... రైనా (20 ఏళ్ల నాలుగు రోజులు; దక్షిణాఫ్రికాపై డిసెంబర్1న, 2006)... రవీంద్ర జడేజా (20 ఏళ్ల 66 రోజులు; శ్రీలంకపై ఫిబ్రవరి 10న, 2009) ఉన్నారు.
అన్ని ఫార్మాట్‌లలో కలిపి సొంతగడ్డపై గత 16 సిరీస్‌లలో భారత్‌కు పరాజయం ఎదురుకాలేదు.
వాంఖడే స్టేడియంలో టి20ల్లో భారత్‌కు ఇదే తొలి విజయం. గతంలో ఆడిన రెండు మ్యాచుల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది.
అన్ని ఫార్మాట్‌లలో కలిపి ఒక ఏడాదిలో అత్యధిక విజయాలు (37) సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా అత్యధి కంగా 38 విజయాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment