
న్యూఢిల్లీ : బంతిని షైన్ చేసే విషయంలో ఇన్నాళ్లు ఉమ్ముకు ప్రత్యామ్నాయంపై చర్చ జరిగింది. కానీ భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ మరో కొత్త తరహా సూచన చేశాడు. కరోనా నేపథ్యంలోనే సలైవా (ఉమ్ము)ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్‌కు ముందు జరిపిన పరీక్షల్లో ఆటగాళ్లెవరికీ కరోనా లేదని తేలితే అప్పుడు లాలాజలాన్ని బంతిపై రుద్దేందుకు అనుమతించాలన్నాడు. బౌలింగ్‌కు ఉమ్ముతోనే పని వుంటుందని చెప్పాడు. ('ఐదు సార్లు వదిలేస్తే సెంచరీ సాధించా')
‘ప్రతి సిరీస్‌కు, మ్యాచ్‌కు ముందు ఆడే ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్షలు చేస్తారు. అందులో నెగెటివ్ అని వస్తే సలైవా వాడితే ముప్పేమీ ఉండదుగా! ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనిపై వైద్యరంగానికి చెందిన వారు పరిశీలించి లోటుపాట్లు వివరించాలని నేను కోరుకుంటున్నాను’ అని అన్నాడు. అసలే క్రికెట్... బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ గేమ్‌గా మారిపోయిందని, ఇలాంటి తరుణంలో బౌలర్లకు ఎంతో ఉపయుక్తమైన ఉమ్మును వాడొద్దంటే అది కచ్చితంగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యాన్ని మరింత పెంచుతుందని విశ్లేషించాడు.