న్యూఢిల్లీ : మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టును ఫైనల్ వరకు నడిపించిన సారథి, హైదరాబాదీ మిథాలీ రాజ్ కెరీర్ 21 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. 2021లో జరిగే తర్వాతి ప్రపంచ కప్‌లో కూడా ఆమెనే సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. టి20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఐసీసీ తరఫున వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ టోర్నీకి లభించిన ఆదరణ, రాబోయే రోజుల్లో భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి వివిధ అంశాలపై ఆమె మాట్లాడింది. విశేషాలు మిథాలీ మాటల్లోనే...
టోర్నీలో మన ప్రదర్శనపై...
భారత బౌలర్లంతా టోర్నీలో అద్భుతంగా రాణించారు. లీగ్ దశలో వారి ప్రదర్శన వల్లే జట్టు సెమీఫైనల్ చేరింది. దురదృష్టవశాత్తూ మన బ్యాటింగ్ విఫలమైంది. ఫైనల్‌కు ముందు ఎనిమిది రోజుల విరామం రావడం కూడా లయను దెబ్బ తీసింది. పైగా ఎంసీజీలాంటి మైదానంలో భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య ఒత్తిడిని అధిగమించి ఆడటం అమ్మాయిలకు సవాల్‌గా మారింది. దాంతో ఫైనల్లో అన్ని రంగాల్లో విఫలమయ్యాం. 2017, 2018, 2020లలో ఒకే తరహా ఫలితం కనిపించింది. లీగ్ దశలో చాలా బాగా ఆడటం, చివరకు వచ్చే సరికి ఓటమిని ఆహ్వానించడం. ఇలాంటి ఒత్తిడి దశను దాటాలంటే నాకు తెలిసి మా జట్టుకు ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అవసరం ఉంది. (చీరకట్టుతో క్రికెట్ ఆడిన మిథాలీ)
భారత మహిళల జట్టును రాటుదేల్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై...
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) కారణంగా మహిళల జట్టు సభ్యులకు కూడా ఎంతో మేలు జరిగింది. కాంట్రాక్ట్ ప్లేయర్లు అక్కడకు వెళ్లి తమ ఫిట్‌నెస్‌ను, ఆటకు ప్రత్యేక కోచ్‌ల పర్యవేక్షణలో మెరుగుపర్చుకోవచ్చు. షఫాలీ వర్మలాంటి 16 ఏళ్ల అమ్మాయిలో ఎంతో సత్తా ఉంది. అలాంటి ప్లేయర్లకు ఎన్‌సీఏలో సరైన మార్గనిర్దేశనం లభిస్తుంది. మహిళల ఐపీఎల్‌లాంటిది ఉంటే వారి ఆట మెరుగవుతుంది. వాస్తవికంగా ఇప్పటికిప్పుడు చెప్పాలంటే అండర్–19, అండర్–23, ‘ఎ’ జట్ల టోర్నీలు నిర్వహించాల్సి ఉంది. ఇలా చేస్తే వచ్చే రెండేళ్లలో ఏ సమయంలోనైనా జాతీయ జట్టులో స్థానం కోసం పోటీ పడగలిగేంత పూర్తి స్థాయి సత్తా ఉన్న కనీసం 30–40 మంది అమ్మాయిలు సిద్ధమవుతారు. వచ్చే ఏడాది తొలిసారి మహిళల విభాగంలో అండర్–19 ప్రపంచ కప్‌ను నిర్వహించనుండటం శుభపరిణామం.
మహిళల క్రికెట్‌పై కరోనా ప్రభావం...
దురదృష్టవశాత్తూ చాలా ఎక్కువగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వన్డే ప్రపంచ కప్ ఉంటే ఆలోగా మేం ఆడబోయే మ్యాచ్‌ల సంఖ్య చాలా చాలా తక్కువ ఉండవచ్చు. క్వాలిఫయర్స్ ఇప్పటికే వాయిదా పడగా, ఐపీఎల్‌తో పాటు జరగాల్సిన టి20 చాలెంజ్ టోర్నీ దాదాపుగా పోయినట్లే. నాలుగు దేశవాళీ టోర్నీలూ రద్దయ్యాయి. ఇప్పుడున్న స్థితిలో ప్లేయర్లు స్పెషల్ ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు కూడా వెళ్లలేరు. ఇంట్లోనే ఉండి ఏదైనా చేయాల్సిందే. అయితే న్యూజిలాండ్‌లాంటి దేశాలతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో రిస్క్ తీసుకోలేము. ఈ స్థితిలో మేం క్రికెట్‌కంటే కూడా దేశం గురించి, రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సిన ప్రమాదాల గురించే ఎక్కువగా భయపడుతున్నాం. (వచ్చే ఏడాదైనా.. మహిళల ఐపీఎల్ మొదలు పెట్టండి!)
సుదీర్ఘ కెరీర్, రాబోయే బయోపిక్‌పై...
నేనెప్పుడూ వర్తమానంలో బాగా పనిచేయడంపైనే దృష్టి పెట్టాను. అయితే భవిష్యత్తులో ఇంకా ఏమేం చేయాలో ఎప్పుడూ ఆలోచించేదాన్ని. ఒక అథ్లెట్ కెరీర్ ఎన్నో ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. అందుకే క్రికెటర్‌గా ఇంకా ఎదగడం గురించే ప్రయత్నించాను. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక దాని కోసం శ్రమించాను. అందుకే 21 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగగలుగుతున్నాను. బయోపిక్‌లో (తాప్సీ నటిస్తోంది) నా క్రికెట్ ప్రయాణం గురించి మరీ ఎక్కువ వివరాలు ఉండకపోవచ్చు. అయితే ఒక్కసారి వెనక్కి చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది. 16 ఏళ్ల వయసులో ట్రైన్‌లలో వెళ్లి మ్యాచ్‌లు ఆడేదాన్ని. ఇప్పుడు అదే వయసు అమ్మాయి ఫ్లయిట్‌లలో ప్రయాణిస్తోంది. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ భాగం కావడం గొప్పగా చెప్పుకోగలను. రాబోయే రోజుల్లో మన దేశంలో పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళల క్రికెట్‌ను కూడా చూసే రోజులు, అలాంటి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. దాని కోసం ఎదురు చూస్తున్నా.
ప్రపంచకప్ ఫైనల్ ప్రేక్షకుల సంఖ్యపై...
ఇంతటి భారీ జనసందోహాన్ని నేనెప్పుడూ చూడలేదు. 2017 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు లార్డ్స్ మైదానం నిండిపోయినా, దాని సామర్థ్యం చాలా తక్కువ. దాదాపు 87 వేల మంది ప్రత్యక్షంగా మహిళల క్రికెట్ మ్యాచ్ చూశారంటే మామూలు విషయం కాదు. మహిళల క్రికెట్ భవిష్యత్తు భద్రంగా ఉందని ఇది చూపించింది.
Comments
Please login to add a commentAdd a comment