
టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్టులో జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతల్ని సొంతం చేసుకున్నాడు.
లండన్: టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్టులో జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతల్ని సొంతం చేసుకున్నాడు. అండర్సన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో టీమిండియా 107 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా తొలి రోజు ఆట సాధ్యం కాకపోగా.. రెండో రోజు కూడా వరణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. రెండో రోజు ఆటలో భాగంగా భారత్ తన ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లకు ఆలౌటైంది.. వాతావరణంలో తేమ ఉండటం, పిచ్ స్వింగ్‌కు అనుకూలించడంతో అండర్సన్ బౌలింగ్‌కు భారత్ దాసోహమైంది.
ఈ మ్యాచ్‌లో చెలరేగిన అండర్సన్.. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఇమ్రాన్ ఖాన్ (94) పేరిట ఉండగా.. 95 వికెట్లతో అండర్సన్ దాన్ని అధిగమించాడు.
మరొకవైపు ఒకే వేదికపై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలోనూ జేమ్స్ అండర్సన్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. కొలంబోలోని సింహాళి స్పోర్ట్స్ గ్రౌండ్‌లో 166 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీ ధరన్.. క్యాండీలో 117 వికెట్లు పడగొట్టాడు. ఇక గాలేలో 111 వికెట్లు తీశాడు. రంగన హెరాత్ గాలేలో 99 వికెట్లు తీయగా.. లార్డ్స్‌లో 23వ టెస్టు ఆడుతున్న అండర్సన్ కూడా ఇప్పటి వరకూ 99 వికెట్లు పడగొట్టి ఐదో స్థానంలో నిలిచాడు.
ఇక స‍్వదేశీ టెస్టుల్లో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. ఈ క్రమంలోనే అనిల్ కుంబ్లేను అండర్సన్ అధిగమించాడు. ప‍్రస్తుతం అండర్సన్ 353 స్వదేశీ వికెట్లతో కొనసాగుతుండగా, ముత్తయ్య మురళీ ధరన్ సొంత దేశంలో జరిగిన టెస్టుల్లో 493 వికెట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: పేస్‌కు దాసోహం