
బూమ్రా అరుదైన ఘనత
హరారే: టీమిండియా యువ పేస్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన ఓవరాల్ టీ 20ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్గా గుర్తింపు పొందాడు. దీంతో పాటు ఒక క్యాలెండర్ ఇయర్లో 50 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్గా ఘనత సాధించాడు. జింబాబ్వే తో జరిగిన తొలి టీ 20లో రెండు వికెట్లు తీసిన బూమ్రా యాభై వికెట్ల మార్కును చేరాడు. 2016లో ఇప్పటివరకూ 40 టీ 20 మ్యాచ్లు (అంతర్జాతీయ టీ 20, దేశవాళీ టీ 20) ఆడిన బూమ్రా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. ఈ ఏడాది బూమ్రా 17 అంతర్జాతీయ టీ 20ల్లో 21 వికెట్లు , 14 ఐపీఎల్ మ్యాచ్ల్లో 15 వికెట్లు సాధించాడు. కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నీలో 9 మ్యాచ్లాడి 14 వికెట్లు తీశాడు.
బూమ్రా తరువాత స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ 49 వికెట్లతో (35 మ్యాచ్లు) రెండో స్థానంలో, డ్వేన్ బ్రేవో 39 వికెట్లు(38 మ్యాచ్లు) మూడో స్థానంలో ఉన్నారు. అయితే భారత్ తరపున ధవల్ కులకర్ణి రెండో స్థానంలో ఉన్నాడు. టీ 20ల్లో ధవల్ కులకర్ణి 22 మ్యాచ్ల్లో 33 వికెట్లు సాధించాడు. అయితే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మాత్రం డ్వేన్ బ్రేవో పేరిట ఉంది. 2015లో బ్రేవో 47 మ్యాచ్లకు గాను 69 వికెట్లు సాధించాడు. అతని తరువాత సునీల్ నరైన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2014లో సునీల్ నరైన్ 66 వికెట్లు సాధించి ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఉన్నాడు.