
మెల్‌బోర్న్ : టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 39 ఏళ్ల నాటి రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాదే అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన ఈ భారత స్పీడ్‌స్టార్.. తన పేరిట సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో బుమ్రా బంతితో ఆతిథ్య జట్టు పతనాన్నిశాసించాడు. మార్కస్ హ్యారీస్, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, టీమ్ పైన్, లయన్, హజల్‌వుడ్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. తద్వారా టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్ర ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డు లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి పేరిట ఉండగా.. తాజాగా బుమ్రా అధిగమించాడు. 1979లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన దిలీప్ దోషి ఆ ఏడాది 40 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్‌ను సాధించాడు. మళ్లీ 39 ఏళ్ల తర్వాత బుమ్రా ఈ రికార్డును బ్రేక్ చేసి దిలీప్‌ను వెనక్కు నెట్టేసాడు. దిలీప్ తర్వాత 37 వికెట్లతో(1996) వెంకటేశ్ ప్రసాద్, నరేంద్ర హిర్వాణీ 36(1988), శ్రీశాంత్ 35(2006)లున్నారు. ఇక ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన బుమ్రా 9 టెస్ట్‌ల్లో మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు.
నా ఫేవరెట్ బౌలర్ : క్లార్క్
మూడో టెస్ట్‌లో బుమ్రా వేసిన వైవిధ్యమైన బంతులకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఫిదా అయ్యాడు. సోనీ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ బుమ్రా ప్రదర్శనను కొనియాడాడు. ‘ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం బుమ్రా నా ఫేవరెట్ బౌలర్. భారత జట్టు విజయానికి కృషి చేసే బౌలర్. కెప్టెన్ కోహ్లి వ్యూహాలకు సరిపోయే బౌలర్. కొత్త, పాత బంతి అనే విషయాన్ని పట్టించుకోని స్పీడ్‌స్టార్. కేవలం అతనికి భారత విజయంలో కీలకం కావడమే కావాలి. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల్లో బుమ్రా అగ్రస్థానంలో లేకపోవచ్చు. కానీ మరికొద్ది రోజుల్లోనే బుమ్రా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానం సొంతం చేసుకుంటాడు.’ అని క్లార్క్ జోస్యం చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment