
బుమ్రా (ఫైల్ ఫొటో)
తృటిలో తొలి టెస్టును చేజార్చుకొని కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగలనుంది.
లార్డ్స్ : తృటిలో తొలి టెస్టును చేజార్చుకొని కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే గాయాలతో టీమిండియా పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను దూరం చేసుకుని తగిన మూల్యం చెల్లించుకుంది. అయితే రెండో టెస్ట్‌కు బుమ్రా అందుబాటులోకి వస్తాడని భావించిన కోహ్లిసేనకు నిరాశే మిగలనున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌తో తొలి టి20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా ఎడమ వేలికి గాయం అయిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే అతడు ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.
ఆ తర్వాత టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో బీసీసీఐ బుమ్రాకు చోటిచ్చింది. తొలి టెస్టులో బుమ్రా ఆడలేడని.. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలిపింది. కానీ, బుమ్రా గాయం నుంచి ఇంకా వందశాతం కోలుకోలేదని తెలుస్తోంది. నెట్స్‌లో బంతులు వేస్తున్నప్పటికీ అతడు ఇంకా పూర్తి సన్నద్ధంగా లేడని జట్టు ఫిజియోలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో లార్డ్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి జరిగే రెండో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉండే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ఇక తొలి టెస్టులో కోహ్లిసేన 31 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.