
'ఆఫ్రిది ఇంకా జట్టులో ఎందుకు?'
పాకిస్తాన్ ట్వంటీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ జావెద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు.
కరాచీ: పాకిస్తాన్ ట్వంటీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ జావెద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు. అసలు ఆఫ్రిది అవసరం ఇంకా జట్టుకు ఏముందంటూ తనదైన శైలిలో చురకలంటించాడు. ఆఫ్రిది ఒక ముగిసిన అధ్యాయంగా మియాందాద్ అభివర్ణించాడు. 'కొన్నేళ్ల క్రితం వరకూ ఆఫ్రిది నమ్మదగిన ఆటగాడే. ఆ స్థాయి ఆట ఇప్పుడు అతనిలో లేదు. ఒక జట్టులో కెప్టెన్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నప్పుడు విజయాలు ఎలా వస్తాయి. జట్టులో ఆఫ్రిది స్థానం ఎక్కడో అతని నిర్ణయించుకోవాలి' అని మియాందాద్ ఎద్దేవా చేశాడు.
దీంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యవహారశైలిని కూడా తప్పుబట్టాడు. జాతీయ జట్టుకు క్రికెటర్లను ఎంపిక చేసే విధానం సరిగా లేదంటూ మండిపడ్డాడు. దేశవాళీ స్థాయిలో ఆటను మెరుగుదిద్దడంలో పీసీబీ పూర్తిగా విఫలమైందన్నాడు. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ ద్వారా నాణ్యమైన ఆటగాళ్లు బయటకు వస్తారని భావించినా అది జరగలేదన్నాడు. జాతీయ ఆటగాడు పీసీబీలో ఆడకంటే బిగ్బాష్ లీగ్, ఐపీఎల్ వంటి విదేశీ లీగ్ల్లో ఆడటానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నారన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ లో ఏమి జరుగుతుందనేది బోర్డు పెద్దలకు మాత్రమే తెలుసన్నాడు. ఇటీవల ఆసియాకప్ లో భారత్ పై పాకిస్తాన్ ఓడిపోవడం తీవ్ర నిరూత్సాహానికి గురిచేసిందన్నాడు.