'నా దేశ అభిమానుల్ని చిన్నబుచ్చలేదు'
కోల్‌కతా: భారత్‌లోనే పాకిస్థాన్ క్రికెటర్లకు అమితమైన ప్రేమాభిమానాలు లభిస్తున్నాయన్న తన వ్యాఖ్యలపై తన స్వదేశంలో విమర్శలు వస్తుండటంతో పాక్ టీ20 టీం కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. తన దేశాన్ని చిన్నబుచ్చే ఉద్దేశం తనకు లేదని, అభిమానులపై గౌరవాన్ని చాటుతూ సానుకూల సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రమే తాను చేశానని ఆయన పేర్కొన్నాడు.
'నేను పాకిస్థాన్ జట్టుకు సారథిని మాత్రమే కాదు, పాక్ ప్రజలందరి తరఫున ప్రతినిధిని. నా వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో చూడాలి. పాకిస్థాన్ అభిమానుల కన్నా ఇతరులెవరూ నాకు ఎక్కువ అనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. నాకు ప్రస్తుతమున్న ఈ గుర్తింపు మొత్తం పాకిస్థాన్ నుంచి వచ్చిందే' అని అఫ్రిది పేర్కొన్న ఆడియో సందేశాన్ని పీసీబీ తన ట్విట్టర్‌లో పేజీలో పోస్టు చేసింది.
అఫ్రిదీ గత ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమకు మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌తోపాటు పలువురు అఫ్రిది వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యల వివాదాన్ని చల్లబర్చేలా పత్రికా ప్రకటన చేసిన అఫ్రిది.. సానుకూల దృక్పథంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం గమనిస్తుంది కాబట్టి భారత్‌లో ఆడినప్పుడు మేం బాగా ఆస్వాదిస్తామని చెప్పానని, ఇదేమాటను గతంలో వసీం అక్రం, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్ కూడా చెప్పారని అఫ్రిది గుర్తుచేశాడు.