అమలు చేస్తారా.. లేదా?
లోధా కమిటీ నివేదికపై బీసీసీఐకి సుప్రీం సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేసే విషయంలో మార్చి 3లోగా స్పందించాలని బీసీసీఐకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సూచించింది. బోర్డులో ప్రక్షాళన కోసం ఏమేం చేయాలో పేర్కొంటూ లోధా కమిటీ గత నెల 4న కోర్టుకు తమ నివేదికను అందించింది. ఈ నివేదిక ను తాము ఆమోదిస్తున్నట్టు, బీసీసీఐ కూడా ఇందులోని విషయాలను అమలుపరచాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఇబ్రహీం కలీఫుల్లాలతో కూడిన బెంచ్ పేర్కొంది. ‘లోధా కమిటీ రిపోర్ట్‌ను అమలు చేయడంలో మీకేమైనా కష్టంగా ఉంటే మేం అమలుపరుస్తాం’ అని బీసీసీఐ కౌన్సిల్‌ను ఉద్దేశిస్తూ బెంచ్ తెలిపింది. కమిటీ రిపోర్ట్‌పై బోర్డు స్పందన ఎలా ఉందో విచారించాలని ఈనెల 25న బీహార్ క్రికెట్ సంఘం కోర్టుకెక్కింది.
‘కమిటీ ప్రతిపాదనలు అమలు చేయడంలో చాలా అభ్యంతరాలున్నాయి. నివేదికను సమీక్షించేందుకు బోర్డుకు చెందిన త్రిసభ్య లీగల్ కమిటీ ఆదివారం సమావేశం కానుంది. ప్రతిస్పందన కోసం ఆయా రాష్ట్రాల యూనిట్లకు కూడా నివేదిక కాపీలను పంపాం. ఇందులో కొన్ని నియమ విరుద్ధాలు ఉన్నాయి. అందుకే దీన్ని పూర్తిగా సమీక్షించేందుకు బీసీసీఐకి కొంత సమయం కావాల్సి ఉంది’ అని బోర్డు తరపు లీగల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే కోర్టు సముచిత సమయాన్నే ఇచ్చిందని జస్టిస్ ఠాకూర్ గుర్తుచేస్తూ ఆయన వినతిని తోసిపుచ్చారు. కచ్చితంగా లోధా కమిటీ సూచనలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.