పుణె : మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. 273/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. రెండోరోజు (అజింక్య రహానే 59, రవీంద్ర జడేజా 91) వికెట్లను మాత్రమే కోల్పోయిన టీమిండియా 328 పరుగులు జతచేసి 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ కోహ్లి 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక తొలిరోజు మూడు వికెట్లు ఖాతాలో వేసుకుని సత్తా చాటిన రబడ రెండో రోజు వికెట్లేమీ తీయలేకపోయాడు. ఫ్లాట్ పిచ్‌పై భారత ఆటగాళ్లు చెలరేగుతుంటే చేష్టలుడిగిపోయాడు. తన బౌలింగ్‌లో అలవోకగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తన్న కోహ్లి, రహానేలను చూసి అతనిలో అసహనం పెరిగింది.
ఇదే క్రమంలో బౌలర్‌ను మార్చితే బాగుంటుందని కీపర్ క్వింటన్ డీకాక్ కెప్టెన్ డుప్లెసిస్‌కు సూచించడంతో.. రబడలో అసహనం తీవ్రస్థాయికి చేరింది. దీంతో డీకాక్‌తో అతను వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో అక్కడే ఉన్న డుప్లెసిస్ కలగజేసుకున్నాడు. రబడను అతను అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘టీమిండియా ఆటగాళ్ల దెబ్బకు రబడకు దిమ్మతిరిగింది. అతనేం చేస్తున్నాడో తెలియడం లేదు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రహానేను మహరాజ్, రవీంద్ర జడేజాను ముత్తుసామి ఔట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment