కగిసో రబడ ( ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : రెండు టెస్టులు నిషేధం విధించడంపై దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 11 వికెట్లతో ఈ సూపర్ బౌలర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రబడ తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోలేక తనను, తన జట్టును తీవ్రంగా నష్టపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ భుజాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ యువ పేసర్.. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను బౌల్డ్ చేసి తీవ్రంగా అరిచాడు. ఈ ప్రవర్తనతో రబడ తర్వాతి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఐసీసీ విధించిన నిషేదంపై రబడ స్పందిస్తూ.. ‘నేను ఇలా చేసుండాల్సింది కాదు. ఈ ప్రవర్తనతో మనిషిగా, వ్యక్తిగా ఎంతో దిగిజారిపోయా. ఈ ఘటనతో నేనెంతో నేర్చుకున్నా. ఇలాంటి తప్పిదాలను భవిష్యత్తులో పునావృత్తం కానివ్వను. ఈ ఘటనలకు చాలా కారణాలున్నాయి. కానీ రూల్స్ రూల్సే. స్మిత్‌ను ఉద్దేశ్యపూర్వకంగా తాకలేదు. లార్డ్స్ మైదానంలో నేను చేసింది తప్పని తెలిసే అప్పుడు అప్పీల్ చేయలేదు. నిజాయితీగా చేప్పాలంటే అసలు నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. ఓ పెద్ద సిరీస్ నుంచి దూరమయ్యాను. నేను చాలా ఆడాల్సింది. కీలక సమయంలో జట్టుకు దూరమయ్యానని’ రబడ ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరి 2017 నుంచి వేర్వేరు ఘటనల్లో (డిక్‌వెలా, స్టోక్స్, ధావన్‌లతో గొడవ) ఇప్పటికే ఐదు డీమెరిట్ పాయింట్లు ఈ పేసర్ ఖాతాలో ఉన్నాయి. దాంతో పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరి రెండు టెస్టుల నిషేధం పడింది. వార్నర్ ఘటనలో కూడా 15 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు 1 డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ శిక్షగా విధించింది. దాంతో రబడ మొత్తం పాయింట్ల సంఖ్య 9కి చేరింది. నాలుగు టెస్టు మ్యాచ్ సిరీస్‌లో ఇరు జట్టు చెరోమ్యాచ్ గెలిచాయి. సరైన సమయంలో రబడా దూరం కావడం దక్షిణాఫ్రికా జట్టుకు నష్టం చేకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment