‘పట్టు’ కొనసాగింది
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఫైనల్లో రెండో రోజు ఆటపై ఆధిపత్యం ప్రదర్శించిన కర్ణాటక శుక్రవారం కూడా అదే పట్టును నిలబెట్టుకుంది. మెరుగైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో మహారాష్ట్ర కొంత వరకు కోలుకున్నా... ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కకుండా నిరోధించడంలో విఫలమైంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది.
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (273 బంతుల్లో 131; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా, రాబిన్ ఉతప్ప (108 బంతుల్లో 72; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. క్రీజ్‌లో గోపాల్ (9 బ్యాటింగ్), వినయ్ కుమార్ (8 బ్యాటింగ్) ఉన్నారు. మహారాష్ట్ర బౌలర్లలో ఫలాకు 3 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం కర్ణాటక 169 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. మరో మూడు వికెట్లు చేతిలో ఉన్న ఆ జట్టు నాలుగో రోజు మరిన్ని పరుగులు జోడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫైనల్లో మహారాష్ట్ర పోటీలో నిలవాలంటే తీవ్రంగా శ్రమించడంతో పాటు ఏదైనా అద్భుతం జరగాల్సిందే. లేదంటే రంజీ ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రాణించిన ఉతప్ప
230/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కర్ణాటక తొలి ఓవర్లోనే గణేశ్ సతీశ్ (117) వికెట్ కోల్పోయింది. తొలి రోజు గాయపడి బయటకు వెళ్లిన ఓపెనర్ ఉతప్ప క్రీజులోకి వచ్చి వేగంగా ఆడాడు. మరో వైపు రాహుల్ 204 బంతుల్లో కెరీర్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో వేయి పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే 72 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఉతప్ప, రాహుల్‌ను ఏడు పరుగుల వ్యవధిలో ముండే అవుట్ చేయడంతో కర్ణాటక జోరు తగ్గింది.
అనంతరం తక్కువ వ్యవధిలోనే మనీశ్ పాండే (66 బంతుల్లో 36; 4 ఫోర్లు), గౌతమ్ (7)లను వెంటవెంటనే పెవిలియన్ పంపించి ఫలా మహారాష్ట్ర శిబిరంలో ఆనందం నింపాడు. అయితే కరుణ్ నాయర్ (118 బంతుల్లో 44; 4 ఫోర్లు), అమిత్ వర్మ (29) కలిసి ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను మళ్లీ నిలబెట్టారు. మహారాష్ట్ర చక్కటి బౌలింగ్‌కు తోడు చివరి సెషన్‌లో కర్ణాటక మరీ నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం తగ్గింది. మొత్తంగా మూడో రోజు ఆడిన 90 ఓవర్లలో కర్ణాటక 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు జత చేసింది.
స్కోరు వివరాలు:
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 305.
కర్ణాటక తొలి ఇన్నింగ్స్: ఉతప్ప (సి) (సబ్) త్రిపాఠి (బి) ముండే 72; రాహుల్ (సి) మొత్వాని (బి) ముండే 131; సతీశ్ (బి) ఖురానా 117; పాండే (ఎల్బీ) (బి) ఫలా 36; నాయర్ (సి) మొత్వాని (బి) ఖురానా 44; గౌతమ్ (సి) అండ్ (బి) ఫలా 7; అమిత్ వర్మ (ఎల్బీ) (బి) ఫలా 29; గోపాల్ (బ్యాటింగ్) 9; వినయ్ కుమార్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (158 ఓవర్లలో 7 వికెట్లకు) 474.
వికెట్ల పతనం: 1-230; 2-318; 3-345; 4-380; 5-394; 6-447; 7-461.
బౌలింగ్: సమద్ ఫలా 32-8-74-3; సంక్లేచా 25-5-66-0; దరేకర్ 26.5-4-105-0; ముండే 30-4-89-2; ఖురానా 39.1-10-110-2; అతీత్కర్ 5-0-18-0.