
నాయర్ ట్రిపుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ (533 బంతుల్లో 310 బ్యాటింగ్; 45 ఫోర్లు; 1 సిక్స్) కెరీర్‌లో తొలిసారిగా అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక 618/7
తమిళనాడుతో రంజీ ఫైనల్
ముంబై: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ (533 బంతుల్లో 310 బ్యాటింగ్; 45 ఫోర్లు; 1 సిక్స్) కెరీర్‌లో తొలిసారిగా అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి కర్ణాటక 189 ఓవర్లలో ఏడు వికెట్లకు 618 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కేఎల్ రాహుల్ (320 బంతుల్లో 188; 17 ఫోర్లు; 3 సిక్సర్లు) మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం జట్టు 484 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఉంది. క్రీజులో తనతో పాటు కెప్టెన్ వినయ్ కుమార్ (175 బంతుల్లో 41 బ్యాటింగ్; 4 ఫోర్లు; 1 సిక్స్) ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలిసారిగా ట్రిపుల్ శతకం బాదిన నాయర్ అద్భుతమైన నిలకడ చూపుతూ రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేశాడు. ఇప్పటికే నాయర్ కర్ణాటక తరఫున ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన గుండప్ప విశ్వనాథ్ (247) రికార్డును అధిగమించాడు.
ఇక మరో 10 పరుగులు చేస్తే ఓవరాల్‌గా రంజీ ఫైనల్లో ఈ ఫీట్ సాధించిన గుల్ మొహమ్మద్ (319, 1946-47లో) రికార్డును కూడా బద్దలుకొడతాడు. అంతకుముందు 323/5 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన కర్ణాటక లంచ్ వరకు ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆరో వికెట్‌కు వీరు 386 పరుగులు జోడించారు. ఆ వెంటనే మరో వికెట్ పడినా ఓపిగ్గా ఆడిన వినయ్... నాయర్‌కు అండగా నిలిచాడు.