
'విరాట్ తప్పేమీ లేదు'
మెల్ బోర్న్: వరల్డ్కప్ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో విరాట్ కోహ్లి తొందరగా అవుటై అనేక విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.
తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మాత్రం విరాట్ తప్పేమీ లేదంటూ సమర్థించుకొచ్చాడు.
'ఒక మ్యాచ్లో విఫలమైతేనే విమర్శించడం సమంజసం కాదు. ఆస్ట్రేలియాపై మంచి గణాంకాలు నమోదు చేసిన యువ ఆటగాడు విరాట్. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో విరాట్ చాలా బాగా రాణించాడు. వరల్డ్ కప్ సెమీస్లో రాణించలేకపోవడం కోహ్లి దురదృష్టం. ఇలాంటివన్నీ క్రీడల్లో సహజమే. సెమీస్లో టీమిండియా ఓడిపోయినందుకు పెద్దగా బాధపడలేదు. బలమైన జట్లే ఫైనల్కు వెళ్లాయి. గత నాలుగు నెలల నుంచి ముక్కోణపు టోర్నీ, టెస్టు సిరీస్ల్లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. వరల్డ్ కప్లో న్యూజిలాండ్ సొంత గడ్డపై అద్భుతంగా రాణించింది. సెమీస్ వరకు టీమిండియా ఎక్కడా కూడా తడబడలేదు. యువ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్తో రాణించారు. ఆసీస్ కూడా బలమైన జట్టు కావడం వల్లనే సెమీస్లో ఇండియా ఓడిపోయింది' అని ద్రావిడ్ అన్నాడు.