
జోడీ నంబర్ 1
► కోల్‌కతా ఓపెనర్లు సూపర్ హిట్
► వరుసగా మూడో సీజన్‌లోనూ నిలకడ
ఫార్మాట్ ఏదైనా ఓపెనర్లు బాగా ఆడితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి జట్టూ మంచి ఓపెనింగ్ జోడీ కోసం చూస్తుంది. ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లూ సరైన ఓపెనర్ల కోసం ఇబ్బంది పడుతూ, ప్రతి సీజన్‌లోనూ మార్పులు చేస్తూనే ఉంటాయి. కోల్‌కతా కూడా ఆరేళ్ల పాటు ఇలాంటి తిప్పలే పడింది. 2014లో తొలిసారి గంభీర్, ఉతప్ప జతకలిశాక ఈ జట్టు రాత మారింది. ఈ ఏడాది కూడా అదే జోరుతో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు.
సాక్షి క్రీడావిభాగం:- మిగిలిన చాలా జట్ల ఓపెనర్లతో పోలిస్తే గంభీర్, ఉతప్ప ఇద్దరూ అంత పెద్ద విధ్వంసకర ఆటగాళ్లేం కాదు. కానీ పవర్‌ప్లేలో ఈ ఇద్దరూ కలిసి అలవోకగా ఓ 50-60 పరుగులు చేసేస్తారు. విరుచుకుపడి సిక్సర్ల సునామీ సృష్టించడం, భీకరమైన షాట్లు ఆడటం కనిపించదు. కానీ పరుగులు వస్తాయి. అడపాదడపా గ్యాప్‌లలోకి ఫోర్లు కొట్టినా... ఈ ఇద్దరూ ఎక్కువగా నమ్ముకుంది స్ట్రయిక్ రొటేట్ చేయడం. సింగిల్ లేదు అనుకునే దగ్గర కూడా ఈ ఇద్దరూ కలిసి పరుగు రాబడతారు. దీనికి కారణం ఈ ఇద్దరికీ కుదిరిన సమన్వయం. మైదానంలో ప్రొఫెషనల్‌గానే కాదు... వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం కూడా దీనికి కారణం.
నిలకడకు మారుపేరు
గంభీర్, ఉతప్ప కలిసి ఇప్పటివరకూ 28 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చేస్తే ఇందులో 18 సార్లు 30 పరుగులకి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఐపీఎల్‌లో మరే జట్టుకూ ఇంత నిలకడైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు లేవు. వాస్తవానికి 2014 సీజన్‌లో ఉతప్ప ఓపెనర్ కాదు. లోయర్ ఆర్డర్‌లో ఆడేవాడు. ఆ సీజన్‌లో గంభీర్, కలిస్, మనీష్ పాండే, బిస్లా... ఈ నలుగురూ కలిసి రకరకాల కాంబినేషన్లలో ఆడారు. కానీ ఏ ఒక్క జోడీ హిట్ కాలేదు. అప్పటికి ఉతప్ప కూడా లోయర్ ఆర్డర్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే ఓ రోజు మ్యాచ్‌కు ముందు జట్టు సమావేశంలో ఓపెనర్ల గురించి చర్చ జరిగినప్పుడు... తాను తొలి స్థానంలో సౌకర్యంగా ఆడతానని ఉతప్ప చెప్పాడు. దీంతో అవకాశం ఇచ్చారు. 2014 మే 2న తొలిసారి ఇద్దరూ కలిసి ఆడారు.
ఆ మ్యాచ్‌లో గంభీర్ రనౌట్ అయ్యాడు. కానీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత... ఒకరితో ఒకరికి స్నేహం పెరిగాక వికెట్ల మధ్య పరుగులోనూ సమస్యలు తొలిగిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత ఈ జోడీ ఆడుతుండగా ఒక్కసారి కూడా రనౌట్ కాలేదు. ఆ సీజన్‌లో ఉతప్ప కోల్‌కతాకు అద్భుతాలు చేసి పెట్టాడు. ఏకంగా 660 పరుగులతో ‘ఆరెంజ్ క్యాప్’ సంపాదించడంతో పాటు కోల్‌కతాను చాంపియన్‌గా నిలబెట్టాడు.
ఒకరి మీద ఒకరికి నమ్మకం
గంభీర్, ఉతప్పల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగు విషయంలో ఇది బాగా కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎక్కువ. ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవిస్తారు. గంభీర్ సింగిల్ కోసం బయల్దేరాడంటే ఉతప్ప కూడా గుడ్డిగా పరుగెడతాడు. సహచరుడి జడ్జిమెంట్ మీద పరస్పరం ఉన్న నమ్మకం ఇది. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇది బాగా కనిపించింది. పరిస్థితికి తగ్గట్లు ఇన్నింగ్స్ పేస్ మార్చడంలోనూ ఇద్దరూ సిద్ధహస్తులే. గంభీర్ వేగంగా ఆడుతున్న సమయంలో పొరపాటున కూడా ఉతప్ప షాట్ల కోసం వెళ్లడు. సింగిల్ తీసి వెంటనే స్ట్రయికింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇటు గంభీర్ కూడా అంతే. ఇద్దరిలోనూ ఉతప్ప కొంత మెరుైగె న హిట్టర్. ప్రస్తుతం ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం కోల్‌కతాకు బాగా కలిసొచ్చే అంశం.
ప్రయోగాల పరంపర
కోల్‌కతాతో పోలిస్తే మిగిలిన జట్లు ఓపెనింగ్ కాంబినేషన్ కోసం ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ లయన్స్, పుణే జెయింట్స్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సన్‌రైజర్స్ జట్టు కూడా 2014 నుంచి కేవలం రెండు జోడీలను మాత్రమే ప్రయత్నించింది. వార్నర్, ధావన్ ఇద్దరూ సూపర్ స్టార్స్ కావడం వల్ల ఓపెనర్లను మార్చడం లేదు. కానీ ప్రస్తుతం ధావన్ ఫామ్ చూస్తే త్వరలోనే హైదరాబాద్ జట్టు కూడా ఓపెనర్లను మార్చక తప్పకపోవచ్చు.
ఇక ఓపెనర్ల విషయంలో ఏమాత్రం నిలకడ లేని జట్టు ముంబై ఇండియన్స్. 2014 నుంచి ఇప్పటివరకూ ఈ జట్టు 11 రకాల ఓపెనింగ్ కాంబినేషన్లను ప్రయత్నించింది. అటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా ఈ మూడు సీజన్లలో 10 రకాల జోడీలను ఆడించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 9 జోడీలతో ప్రయోగాలు చేస్తే... పంజాబ్ ఆరు కాంబినేష్లను ప్రయత్నించింది. ఏమైనా ఓపెనర్లు ఇద్దరూ ఫామ్‌లో ఉంటే ఆ జట్టు సురక్షితంగా ఉన్నట్లే. కోల్‌కతా విషయంలో మరోసారి ఇదే నిజమయింది.