గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్... కోల్కతా విన్
న్యూఢిల్లీ: గౌతమ్ గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో కోల్కతా నైట్ రైడర్స్ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్-7లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో బుధవారం ఫిరోజ్ షా కోట్లా మైదానం జరిగిన మ్యాచ్లో గంభీర్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా రెండు వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లో ఛేదించింది. గంభీర్ అర్థ సెంచరీతో రాణించాడు. 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. రాబిన్ ఊతప్ప 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 47 పరుగులు చేశారు. మనీష్ పాండే 23 పరుగులు సాధించాడు. ఢిల్లీ బౌలర్లలో పార్నెల్ 2 వికెట్లు తీశాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. డుమిని 40, దినేష్ కార్తీక్ 36, జాదవ్ 26, మురళీ విజయ్ 24 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో కల్లిస్, యాదవ్, షకీబ్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. గంభీర్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.