మళ్లీ దరఖాస్తులు ఎందుకోసం?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ తిరిగి దరఖాస్తుల్ని ఆహ్వానించడంపై కోచ్ రేసులో ఉన్న లాల్ చంద్ రాజ్పుత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకసారి కోచ్ పదవి కోసం గడువు ముగిసినా, మళ్లీ దరఖాస్తుల్ని ఆహ్వానించాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజ్పుత్ మండిపడ్డారు. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్స్ ను మాటను పక్కకు పెట్టి, తాజా దరఖాస్తులంటూ కొత్త పల్లవి అందుకోవడం ఎవరి కోసమని ప్రశ్నించాడు.
'ఇది కచ్చితంగా మంచి పరిణామం కాదు. కోచ్ పదవి కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. అయినప్పటికీ మళ్లీ కోచ్ పదవి కోసం దరఖాస్తులంటూ బీసీసీఐ ముందుకొచ్చింది. అసలు బీసీసీఐ ఉద్దేశం ఏమిటి. ఎవరి ప్రయోజనాల కోసం కోచ్ దరఖాస్తుల్ని తిరిగి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు అభ్యర్ధులు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశారు. వారిపై మీకు నమ్మకం లేదనేది అర్ధమవుతోంది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ప్రజల్ని ఎందుకు అయోమయంలో పడేస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదు. కోచ్ గా చేసే వాడికి ఆటగాడిగా భారీ రికార్డు అవసరం లేదనేది బీసీసీఐ తెలుసుకోవాలి. ఫలాన వ్యక్తితో సక్సెస్ సాధిస్తామనేది గ్యారంటీ లేనిది. కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ అవసరం. ఇక్కడ ఇంగ్లిష్ క్రికెట్ బోర్డును పరిశీలించండి. ఇంగ్లండ్ జట్టును కోచ్ ట్రెవర్ బెయిలిస్ ఎలా ముందుగా తీసుకువెళుతున్నాడో చూడండి. అతనికి ఆటగాడిగా మెరుగైన రికార్డు లేదు. టెక్నికల్ గా మంచి పరిజ్ఞానం ఉంది. ఈ విషయాన్ని బీసీసీఐ అర్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కానీ, కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించాల్సిన అవసరం లేదు'అని రాజ్ పుత్ పేర్కొన్నాడు.