దుబాయ్:ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన శ్రీలంక.. ఇప్పుడు సరికొత్త రికార్డుపై కన్నేసింది. పాకిస్తాన్ తో ఈరోజు ఆరంభయ్యే రెండో టెస్టులోనూ విజయం సాధించి అరుదైన మైలురాయిని సొంతం చేసుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఆఖరిదైన రెండో టెస్టులో సైతం శ్రీలంక గెలిచిన పక్షంలో యూఏఈలో పాకిస్తాన్ పై టెస్టు సిరీస్ ను సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. ఇప్పటివరకూ యూఏఈ తటస్థ వేదికగా జరిగిన టెస్టు సిరీస్ లను పాకిస్తాన్ ఎప్పుడూ కోల్పోలేదు. గతంలో ఇక్కడ జరిగిన తొమ్మిది సిరీస్ లను పాక్ ఏనాడు చేజార్చుకోలేదు. 2009 లో పాకిస్తాన్ లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తరువాత యూఏఈలో జరిగిన తొమ్మిది సిరీస్ ల్లో పాక్ ఐదింట విజయం సాధించగా, నాల్గింటిని డ్రా చేసుకుంది.
కాగా, తాజాగా జరిగే రెండో టెస్టులో పాక్ ఓటమి పాలైతే మాత్రం సిరీస్ ను 2-0 తో కోల్పోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ను డ్రా చేసుకున్నప్పటికీ పాక్ సిరీస్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దాంతో రెండో టెస్టులో పాకిస్తాన్ ఎలాగైనా గెలిచి ఆ రికార్డును కాపాడుకోవాలని భావిస్తోంది. మరొకవైపు శ్రీలంక మాత్రం తొలి టెస్టులో ఓటమి అంచుల నుంచి సంచలన విజయం సాధించడంతో రెండో టెస్టుకు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మధ్యాహ్నం గం.3.30 ని.లకు ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment