
లండన్: యార్కర్ల కింగ్ లసిత్ మలింగ 2007 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్‌తోసహా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్‌లోనూ తాను మరోసారి హ్యాట్రిక్ నమోదు చేయొచ్చంటున్నాడు మలింగ. ఐసీసీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలింగ మాట్లాడుతూ.. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయడాన్ని సవాల్‌గా తీసుకోవాల్సిందే. అప్పుడే మన సామర్థ్యానికి అసలు పరీక్ష ఎదురవుతుంది. ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తా. ఈసారి ఐపీఎల్‌లో విజయవంతం అవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేదే. వికెట్లు తీయగలిగే నైపుణ్యం నాకుందని నేను నమ్ముతా. అదే నాకు కావాల్సిన శక్తిని ఇస్తుంది’ అని పేర్కొన్నాడు.
కాగా, మరొక్క వికెట్ తీస్తే వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన వారి జాబితాలో తమ దేశానికే చెందిన సనత్ జయసూర్యను మలింగ అధిగమించి టాప్–10లోకి చేరతాడు. ఇక కరుణరత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు తన తొలి ప్రపంచకప్ పోరులో న్యూజిలాండ్‌తో జూన్ 1న తలపడనుంది. సీనియర్ ఆటగాళ్లు లసిత్ మలింగ, మాథ్యూస్‌లపైనే ఆజట్టు ఆధారపడి ఉంది. మలింగకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.