'ఆ పదవులపై ఎందుకంత వ్యామోహం'
నాగ్పూర్:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పారదర్శకతలో భాగంగా జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు మిగతా క్రీడల్లో అవసరమని బీజేపీ బహిష్కృత ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఒక గేమ్లో పారదర్శకత కోసం లోధా ప్యానల్ చేసిన సిఫారుసులు క్రికెట్ కు ఎంత అవసరమో, అదే తరహా సూచనలు మిగతా క్రీడల్లో అనివార్యమని ఆజాద్ పేర్కొన్నారు. భారతదేశంలోని కొన్ని క్రీడా బోర్డులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని ఆజాద్ విమర్శించారు.
'క్రీడలపై నమ్మకం ఉండాలి. అది క్రికెట్ అయినా, ఇంకా వేరే గేమ్ అయినా పారదర్శకత అవసరం. అందుకోసం లోధా తరహా ప్యానల్ను మిగతా క్రీడలకు కూడా ఏర్పాటు చేసి ప్రక్షాళనకు నడుంబిగించాల్సి అవసరం ఎంతైనా ఉంది' అని ఆజాద్ తెలిపారు.
మరొకవైపు లోధా ప్యానల్ సూచనలపై బీసీసీఐ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయాల్సి వస్తుందో తనకు అర్ధం కావడం లేదన్నారు.అసలు లోధా సిఫారుసులను వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. క్రికెట్ గేమ్ అనేది ఆటగాళ్ల వల్లే ఖ్యాతి పొందిందనే విషయాన్ని అధికారులు గుర్తించుకుంటే మంచిదని చురకలంటిచారు. క్రికెట్ పరిపాలన అధికారుల వల్ల ఆ క్రీడ బ్రతుకుందని తాను అనుకోవడం లేదన్నారు. అటువంటప్పుడు ఆ పదవుల్ని పట్టుకుని ఎందుకు వెళాడుతున్నారని ఆజాద్ ఘాటుగా విమర్శించాడు. తమ పదవులపై ఎందుకు అంత వ్యామోహమని ఆజాద్ మండిపడ్డారు.