
ముంబై : పని భారం పేరిట కీలక ఆటగాళ్లను ఐపీఎల్ ఆడకుండా ఇంట్లో కూర్చోమనడం సరైంది కాదని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ముంబై ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా కచ్చితంగా ఐపీఎల్ ఆడాల్సిందేనన్నాడు. బుమ్రా పనిభారం గురించి భారత క్రికెటర్లు నిద్రలేకుండా ఆలోచించవద్దని, ఆ విషయాన్ని తమ ఫ్రాంచైజీ చూసుకుంటుందని తెలిపాడు. ఇండియా టుడేతో జయవర్దనే మాట్లాడుతూ.. ‘పనిభారం గురించి ఆలోచించాల్సిందే కానీ మంచి పోటీగల క్రికెట్‌ను ఆడటం కూడా ముఖ్యమే. ఇప్పటికే భారత్ ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించాడానికి బీసీసీఐ వారికి కావాల్సిన విశ్రాంతినిచ్చింది. గొప్ప ఆటగాళ్లు ఎప్పుడు ఆడుతూనే ఉండాలనేది నా అభిప్రాయం. వారు ఇంట్లో కూర్చోవద్దు. ఆడుతూనే ఉండాలి. ఆటగాళ్ల వర్క్‌లోడ్ విషయంలో మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. బుమ్రా యాక్షన్ వల్ల గాయం అయ్యే అవకాశం ఉందనడం సరికాదు. మారథాన్ రన్నర్స్ టెక్నిక్ వీడియోలు చూసినప్పుడు కూడా మనకు వారికేదో గాయం అయినట్లు అనిపిస్తోంది కానీ.. వారు అద్భుత రికార్డులు సృష్టిస్తారు. బుమ్రా కూడా అలానే. అతను మంచి అటాకింగ్ అప్షన్. డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ ముఖ్యం. అతను కచ్చితంగా గేమ్ చేంజరే.’ అని జయవర్దనే చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ ముగిసిన రెండు వారాలకే మెగా టోర్నీ ప్రపంచకప్ ప్రారంభం కానుండటంతో ఆయా దేశాలు తమ ఆటగాళ్ల విషయంలో పునరాలోచనలో పడ్డాయి. బీసీసీఐ కూడా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలో జయవర్దనే కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు భారత ప్రధాన ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే విషయమై ఎలాంటి పరిమితి విధించలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ ప్రత్యేకించి ఇన్నే మ్యాచ్‌లు అడాలని మా వాళ్లెవరికి చెప్పలేదు. నేను ఒకవేళ 10, 12 లేదంటే 15 మ్యాచ్‌లు ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. అలాగే ఇంకొందరు ఎక్కువైనా ఆడొచ్చు.తక్కువైనా ఆడొచ్చు. ఇది ఆయా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశం. ఇందులో ఎవరి ప్రమేయం ఉండబోదు. ప్రపంచకప్ అనేది ప్రతి ఆటగాడి కల. అందుకే ప్రతి ఒక్కరు దాన్నే లక్ష్యంగా చేసుకుంటారు. అంతేగానీ మెగా ఈవెంట్‌కు ఎవరు మాత్రం దూరమవ్వాలనుకుంటారు’ అని కోహ్లి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment