
మహేళ జయవర్దనే- సంజనా గణేషన్(PC: ICC)
దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్దనే టీ20 జట్టు టాప్-5లో ఉన్నది వీళ్లే!
Mahela Jayawardene First 5 Players Of His T20 XI: తన టీ20 జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల పేర్లను శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ మహేళ జయవర్దనే ప్రకటించాడు. ఇందులో అఫ్గనిస్తాన్ నుంచి ఒకరు, పాకిస్తాన్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి, ఇంగ్లండ్ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చాడు. వారిని టాప్-5గా ఎంచుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో వర్చువల్‌గా మాట్లాడిన జయవర్దనే ఈ మేరకు తన జట్టులోని టాప్-5ని వెల్లడించాడు.
ఇంతకీ ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరంటే.. రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, జస్‌ప్రీత్ బుమ్రా, జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్. ది ఐసీసీ రివ్యూలో భాగంగా ఈ ముంబై ఇండియన్స్ కోచ్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... టీ20 క్రికెట్‌లో బౌలర్లదే కీలక పాత్ర పాత్ర. రషీద్ ఖాన్ విషయానికొస్తే అతడు మంచి స్పిన్నర్. అదే విధంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. నా జట్టులో అతడు అగ్రస్థానంలో ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు.
అదే విధంగా ఐపీఎల్-2022లో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ గురించి చెబుతూ.. ‘‘జోస్‌తో ఓపెనింగ్ చేయడం ఇష్టం. తను దూకుడైన బ్యాటర్. పేస్, స్పిన్ బాగా ఆడగలడు. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఏఈలో కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. అద్భుతంగా రాణించాడు’ అని ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌పై జయవర్దనే ప్రశంసలు కురిపించాడు.
ఇక జస్‌ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా జయవర్దనే అభివర్ణించాడు. అందుకే అతడిని తన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సంజనాను ఉద్దేశించి.. ‘‘నువ్వు సిగ్గు పడొద్దు సంజనా.. ఎందుకంటే నేను చెప్పబోయేది నీ భర్త పేరే’’ అని జయవర్దనే పేర్కొనడం విశేషం. ఇక బుమ్రాతో పాటు పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది, మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు అతడు చోటిచ్చాడు.
చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..!