
ధోనిపై వేటు!
ముంబై:ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10వ సీజన్ కు సంబంధించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ధోనిని తొలగించారు. ఈ మేరకు ఆదివారం పుణె యాజమాన్యం తుది నిర్ణయం తీసుకుంది. గతేడాది ధోని నేతృత్వంలో పుణె సూపర్ జెయింట్స్ పేలవమైన ఆట తీరుతో టాప్-4లో స్థానం సంపాదించలేకపోయింది. గత ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ జట్టుతో పాటు, పుణె సూపర్ జెయింట్స్ లు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లీగ్ దశలో గుజరాత్ టాప్ లో నిలిస్తే, పుణె చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
ఐపీఎల్-9 సీజన్ లో 14 మ్యాచ్లాడిన పుణె.. కేవలం ఐదు విజయాల్ని మాత్రమే నమోదు చేసి యాజమాన్యం పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది. ఈ క్రమంలోనే ఏడో స్థానానికి పరిమితమైంది పుణె. మరొకవైపు ధోని కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. 12 ఇన్నింగ్స్ ల్లో ఒక హాఫ్ సెంచరీ సాధించి 284 పరుగులు సాధించాడు. ఈ అంశాలను నిశితంగా పరిశీలించిన పుణె యాజమాన్యం.. ధోనిని కెప్టెన్ గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో ఆస్ట్రేలియా కు చెందిన స్టీవ్ స్మిత్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది.
ధోని కెప్టెన్సీపై పుణె యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగానే చెప్పొచ్చు. 2010, 11ల్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్స్ ను సాధించడంలో ధోని పాత్ర వెలకట్టలేనింది. దాంతో పాట 2010, 14 చాంపియన్స్ లీగ్ టైటిల్స్ ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. గతేడాది ఐపీఎల్లోకి అడుగుపెట్టిన పుణె.. కెప్టెన్ గా ధోనిని తొలగించడం తొందరపాటు నిర్ణయంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.