
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీల వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. పురుషుల విభాగంలో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో అలానా కింగ్ (ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (ఆసీస్ బ్యాటర్), తిసాట్చా పుత్తవోంగ్ (థాయ్‌ల్యాండ్ బౌలర్) నామినీస్‌గా నిలిచారు.
ఫిబ్రవరిలో ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన వారిని ఐసీసీ నామినీస్‌గా ఎంపిక చేసింది. ఓటింగ్ ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ విజేతలను ప్రకటిస్తారు.
శుభ్‌మన్ గిల్: ఫిబ్రవరి నెలలో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతను 100కుపైగా సగటుతో 406 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ వరుసగా 87, 60, 112 పరుగులు చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై మరో సెంచరీ బాదాడు. ఇదే నెలలో గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.
గ్లెన్ ఫిలిప్స్: ఫిబ్రవరి నెలలో ఫిలిప్స్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సిరీస్‌లో ఫిలిప్స్ వరుసగా 28 నాటౌట్, 20 నాటౌట్, 106 (74 బంతుల్లో 7 సిక్సర్లు) స్కోర్లు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఫిలిప్స్ విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో ఫిలిప్స్ మెరుపు అర్ద సెంచరీ (39 బంతుల్లో 61) సాధించాడు. ఇదే మ్యాచ్‌లో ఫిలిప్స్ పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ క్యాచ్‌ను నమ్మశక్యంకాని రీతిలో అందుకున్నాడు.
స్టీవ్ స్మిత్: ఫిబ్రవరి నెలలో స్మిత్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించాడు. ఈ నెలలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో స్మిత్ రెండు సెంచరీలు బాదాడు. ఫలితంగా ఈ సిరీస్‌లో స్మిత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనలతో స్మిత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment